Cyber Crime: విరహ వేదన తీరుస్తామంటూ డాక్టర్‌కు వల.. రూ.12 లక్షలు బురిడి

నిత్యం జనాలతో కిటకిటలాడే మనుషుల మధ్య ఒంటరితనంతో బాధపడే వారు ఎంతోమంది. ఆ లోటును భర్తీ చేసేందుకు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నవారిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచేస్తున్నారు. తాజాగా వీరి వలలో చిక్కుకున్న ఓ వైద్యురాలు రూ. 12 లక్షలు నష్టపోయారు.
తమనితాము లవ్ గురూలుగా పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ వద్ద నుంచి రూ.12లక్షలు కాజేశారు ఇద్దరు నైజీరియెన్లు. తమ వద్ద ఉన్న మూలికలతో ప్రేమైక జీవితంలో పెనుమార్పులు తీసుకువస్తామంటూ నమ్మబలికిన ఇరువురూ.. పలు దఫాల్లో వైద్యురాలి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు గుంజినట్లు తెలుస్తోంది. క్రమంగా వారి గురించి అసలు విషయం తెలుకున్న ఆమె...పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి గుట్టు రట్టైంది.
వైద్యురాలి ఫిర్యాదు మేరకు నైజీరియాకు చెందిన ఒకౌచుకు(41), ఒబియౌరు జోనాథన్ (35)ను రాచకొండ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు, మిగతా ఇద్దరు నిందితులైన అజుండ, డానియల్ కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. బాదితురాలు తన జీవితంలో ప్రేమ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలుస్తోంది. దీంతో ఆమె ఆన్‌లైన్‌లో ప్రేమ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలని వెతుకుతుండగా వీరి వలలో చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు.
ఉగాండ నుంచి బట్టల వ్యాపారం కోసం వచ్చిన వీరు ప్రేమ, ఆస్ట్రాలజీ, వ్యక్తిగత సమస్యలు తీర్చే తాంత్రికులుగా సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకున్నారు. బ్రోకర్ల సాయంతో బ్యాంక్ ఖాతా తీసుకున్న వీరు వారి ఫోన్‌నెంబర్లను పోస్టర్లలో, సోషల్‌మీడియాలో బాగా పబ్లిసిటీ చేసుకున్నారు. ఆప్తమాలజిస్ట్ అయిన బాధితురాలు వారి నెంబర్లను సంప్రదించగా తన ప్రేమ, వృత్తి పరమైన సమస్యలు తీరుస్తామని నమ్మబలికి మొదట రూ.1.45లక్షలు ఖాజేశారు.
తరువాత వేరే వేరే విషయాలు చెప్పి ఆమె వద్ద నుంచి మొత్తం రూ.12లక్షలు కాజేశారు. దీంతో మోసపోయామని గుర్తించిన సదరు డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని ఢిల్లీలో పట్టుకొని హైదరాబాద్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com