సైబర్ క్రైం.. మోసపోయిన నగరవాసి.. అకౌంట్‌లో రూ.1.2 లక్షలు మాయం

ఆన్‌లైన్ ఆఫర్లు ఊరించే అంశాలు. ఇంక వరుస సెలవులొస్తే మొబైల్‌తోనే కాలక్షేపం. ఆ వస్తువు సగం రేటుకే వస్తుందంటే అవసరం ఉన్నా లేకపోయినా కొనేయడం అదే చేశాడు నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు. గతంలో ఇతడు ఇంటర్ నెట్ ద్వారా క్లిక్ ప్రో మీడియా లిమిటెడ్ సంస్థ వివరాలు తెలిసి అందులో 10వేలు పెట్టుబడి పెట్టాడు. దానికి ప్రతినెలా 10 శాతం వడ్డీ వస్తోంది.
వాళ్లు ఇచ్చే యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ద్వారా మై క్లిక్ బ్యాంక్ యాప్‌లోకి ఎంటర్ కావాలి. అందులో జమ అయ్యే మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకుని డ్రా చేసుకోవాలి. కొన్ని నెలల క్రితం 10వేలు కట్టి స్కీంలో చేరిన యువకుడికి ఇప్పటి వరకు రూ.5600 వచ్చాయి.
దాంతో కంపెనీపై అతడికి నమ్మకం కుదిరింది. ఇదిలా ఉండగా శుక్రవారం అతడికి కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. స్వీట్ వాయిస్‌తో ఓ యువతి ఫోన్ చేసి వరుస సెలవుల నేపథ్యంలో కంపెనీ స్పెషల్ ఆఫర్ ఇస్తుందని చెప్పింది. రూ.40 వేలు చెల్లించి వీఐపీ గోల్డ్ కార్డ్ సభ్యుడిగా మారాలని సూచించింది. ఇలా చేస్తే 20 శాతం ప్రత్యేక బోనస్ వస్తుందని తెలిపింది.
ఆమె మాటలు నమ్మి అతడు శనివారం రూ.40 వేలు చెల్లించాడు. దీంతో అతడికి యాప్‌లో కొంత మొత్తం జమైనట్లు కనిపించింది. ఇలాగే మరోసారి కాల్ చేసి ఈ సారి రూ.50 వేలు చెల్లించమంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 19తో ముగుస్తుందని చెప్పింది. దీంతో బాధితుడు మరో రూ.50 వేలు చెల్లించాడు.
ఆపై కొద్ది సేపటికి యాప్‌లో 8వేలు జమైనట్లు వచ్చింది. మళ్లీ కాల్ చేసి ఇంకో 30వేలు పంపించమంది. ఆ తరువాత యాప్‌లో నగదు జమ కాకపోవడం, బుధవారం నుంచి యాప్ పని చేయకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com