కొడుక్కి మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి ఫోన్.. నాన్న అకౌంట్‌లో డబ్బులు ఖాళీ

కొడుక్కి మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి ఫోన్.. నాన్న అకౌంట్‌లో డబ్బులు ఖాళీ
ఫోన్ తీసుకున్న వెంటనే ఎవరు మీలో కోటీశ్వరుడు అనే ప్రోగ్రాంకు సంబంధించిన లాటరీ గెలుచుకున్నారని రెండు మెసేజ్‌లు వచ్చినట్లు చెప్పాడు.

ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాన్న ఓసారి ఫోన్ ఇయ్యవా అంటూ నస పెడుతుండేసరికి సరే ఓ గంటలో ఇచ్చేయంటూ కొడుకు చేతిలో ఫోన్ పెట్టాడు తండ్రి. మరుసటి రోజు అకౌంట్ నుంచి రూ.50 వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చేసరికి కంగు తిన్నాడు తండ్రి. కొత్తరకం మోసాలకు తెరతీస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

ఫోన్‌లో ఉన్న గూగుల్ పే, ఫోన్ పే యాప్‌ల ద్వారా డబ్బు పంపడం సులభం అయిపోయింది. ఆ విధంగానే కొడుకు డబ్బు పంపాడని తెలుసుకుని సదరు వ్యక్తులకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తుంది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట కుమ్మరబస్తీకి చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

కుటుంబ సభ్యులతో కలిసి కుమ్మర బస్తీలోనే నివాసం ఉంటున్నాడు. ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటానంటే కొడుక్కి ఫోన్ ఇచ్చాడు తండ్రి. అకౌంట్లో డబ్బులు ఎట్లా మాయం అయ్యాయని కొడుకుని నిలదీయగా.. ఫోన్ తీసుకున్న వెంటనే ఎవరు మీలో కోటీశ్వరుడు అనే ప్రోగ్రాంకు సంబంధించిన లాటరీ గెలుచుకున్నారని రెండు మెసేజ్‌లు వచ్చినట్లు చెప్పాడు.

వాళ్లకు ఫోన్ చేస్తే రిజిస్ట్రేషన్ చార్జీలకని రూ.16 వేలు ఒకసారి, రూ.25వేలు మరోసారి , రూ.9,100లు మరోసారి పంపించమని కోరగా పంపానని చెప్పాడు. లాటరీ డబ్బు అకౌంట్లో పడుతుందని చెప్పి వారు ఫోన్ పెట్టేశారని చెప్పాడు. తాము మోసపోయామని గ్రహించిన తండ్రి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story