Mysuru Suicide: ప్రియుడితో వెళ్లిపోయిన యువతి..కుటుంబం ఆత్మహత్య..

Mysuru Suicide:  ప్రియుడితో వెళ్లిపోయిన యువతి..కుటుంబం ఆత్మహత్య..
X
కర్ణాటకలోని మైసూరులో విషాదకర ఘటన

కన్నకూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ కుటుంబం తీవ్ర నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులతో పాటు మరో కుమార్తె కూడా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. మైసూరుకు చెందిన మహాదేవస్వామి, మంజుల దంపతులకు అర్పిత, హర్షిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమ పిల్లలను బాగా చదివించి, ఉన్నత స్థాయిలో చూడాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. అయితే, వారి పెద్ద కుమార్తె అర్పిత ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. పెద్దల మాటలను లెక్కచేయని అర్పిత, తాను ప్రేమించిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు, చెప్పాపెట్టకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన మహాదేవస్వామి, మంజుల దంపతులు తమ చిన్న కుమార్తె హర్షితతో కలిసి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కన్నవారి ఆశలను కాదని కూతురు తీసుకున్న నిర్ణయం, చివరకు ఆ కుటుంబంలోనే తీవ్ర విషాదాన్ని నింపింది.

Tags

Next Story