Delhi Cyber Crime: పోలీసులే దొంగలు.. సైబర్ క్రైమ్ కేసు రికవరీల నుండి రూ.75 లక్షలు స్వాహా

Delhi Cyber Crime: పోలీసులే దొంగలు.. సైబర్ క్రైమ్ కేసు రికవరీల నుండి రూ.75 లక్షలు స్వాహా
X
సైబర్ పోలీస్ స్టేషన్‌లో సాధారణ ఆడిట్‌లలో అవకతవకలు కనుగొనబడిన తర్వాత అంతర్గత దర్యాప్తు ప్రారంభమైంది.

ఈశాన్య ఢిల్లీలో సైబర్ క్రైమ్ కేసు రికవరీల నుండి రూ. 75 లక్షలు స్వాహా చేయడంలో ఇద్దరు సబ్-ఇన్‌స్పెక్టర్లకు (SI) ప్రమేయం ఉందని తెలుసుకుని మొదట అవాక్కయ్యారు పై అధికారులు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు.

సైబర్ నేరగాళ్లను గుర్తించడంలో దిట్టలు.. పోలీసు కొలువులో ఉండి సైబర్ నేరగాళ్లను కటకటాలకు వెనకకు పంపించాల్సిన వాళ్లు. వాళ్లే సైబర్ నేరానికి పాల్పడి జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా బుద్ది వక్రిస్తే ఇలాంటి పనులే చేస్తారేమో. పైగా తాము చేసే పనిని ఎవరూ గుర్తించట్లేదనే భ్రమలో ఉంటారు. నిజం ఏనాటికైనా బయటపడుతుందని, పరువు పోతుందని ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అంత పెద్ద హోదాని గంగ పాల్జేసి ఓ నేరస్తుడిలా తలవంచుకోవడం ఎంత సిగ్గు చేటు.

సైబర్ పోలీస్ స్టేషన్‌లో సాధారణ ఆడిట్‌లలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన పై అధికారులు తర్వాత అంతర్గత దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. అప్పుడే అసలు విషయం బయట పడింది. దొంగలు బయట లేరు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారని, తమ స్టాఫ్ లోనే దొంగలు ఉన్నారని తెలుసుకున్నారు.

మార్చి 19 నుండి కనిపించకుండా పోయిన ప్రధాన నిందితుడు SI అంకుర్ మాలిక్‌ను ఇన్‌స్పెక్టర్ రాహుల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం గుర్తించింది. మాలిక్ ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగిస్తున్నాడు. తనను గుర్తించకుండా ఉండటానికి తరచుగా సిమ్ కార్డులను మారుస్తున్నాడు. చివరకు జూలై 18న నగరంలోని సాన్వర్ రోడ్‌లోని ఒక టౌన్‌షిప్‌లో ఒక మహిళా సహచరుడితో పాటు ఉన్న అతడిని పట్టుకున్నారు.

నగరంలోని వారి అద్దె ఫ్లాట్‌పై ఢిల్లీ పోలీసులు జరిపిన దాడిలో రూ.12 లక్షల నగదు, బంగారు నాణేలు, ఆభరణాలు, ఫోన్లు, ల్యాప్‌టాప్, నేరారోపణ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

దొంగిలించబడిన డబ్బును తెల్లగా మార్చుకోవడానికి ఆ బృందం మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించినట్లు డేటా విశ్లేషణలో వెల్లడైంది. మాలిక్ విచారణ ఆధారంగా, ఈశాన్య ఢిల్లీకి చెందిన మరో ముగ్గురు వ్యక్తులు - మహ్మద్ ఇలియాస్, ఆరిఫ్, షాదాబ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇండోర్‌లో శాశ్వతంగా స్థిరపడాలని యోచిస్తున్నారని ఢిల్లీ పోలీసు అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ కేసుపై మరిన్ని దర్యాప్తులు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు.

Tags

Next Story