CYBER CRIME: దేశంలోనే అతిపెద్ద సైబర్ దోపిడీ

బెంగళూరుకు చెందిన మహిళ నుంచి సైబర్ మోసగాళ్లు రూ.31.83 కోట్లు దోచుకున్నారు. డీహెచ్ఎల్ సిబ్బంది అని మొదట పరిచయం చేసుకున్న సైబర్ మోసగాళ్లు.. ఆమె పేరు మీద ముంబై నుంచి నిషేధిత వస్తువులతో కూడిన పార్సిల్ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత.. సీబీఐ, ఆర్బీఐ అధికారులుగా పరిచయం చేసుకుంటూ.. ఆమెను డిజిటల్ అరెస్ట్ చేశారు. ఆస్తుల తనిఖీ పేరుతో ఆమెను బెదిరించి.. ఏకంగా 187 ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.31.83 కోట్లు కొట్టేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
2024 సెప్టెంబర్ 15న ఆమెకు ఒక కొరియర్ వచ్చినట్టు వ్యక్తి నుండి కాల్ వచ్చింది. ముంబైలోని అంధేరి నుండి ఆమె పేరు మీద బుక్ చేసుకున్న ప్యాకేజీలో నాలుగు పాస్‌పోర్ట్‌లు, మూడు క్రెడిట్ కార్డులు , MDMA వంటి నిషేధిత వస్తువులు ఉన్నాయని చెప్పాడు. అయితే తాను ముంబైకి ప్రయాణించలేదని మొత్తుకుంది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఇది సైబర్ క్రైమ్ కేసు కిందికి వస్తుందని భయపెట్టారు. ఏంజరిగిందో ఆలోచించుకునే లోపే సీబీఐ అధికారులు అంటూ మరో కాల్ వచ్చింది. మీరు పెద్ద నేరమే చేశారు, మిమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించారు. దీనికి సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు . స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకూడదని హెచ్చరించారు.
నకిలీ లేఖలతో బెదిరింపులు
రెండు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. దుర్భాషలాడారు. ఆమె ఫోన్ యాక్టివిటీ , లొకేషన్ గురించి తెలుసని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే తాము చెప్పినట్టు చెయ్యాలని పట్టుబట్టారు. నకిలీ సీబీఐ ఆఫీసర్లు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నకిలీ లేఖలను కూడా సమర్పించారు. స్కైప్ ద్వారా రోజువారీ నిఘాలో ఉంచారు. దీంతో కుటుంబ భద్రతకు భయపడి, బాధితురాలు ఆమె అడిగిన డబ్బును చెల్లించేందుకు ఒప్పుకుంది. ఈవిధంగా సైబర్ మోసగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో బాధితురాలిని బెదిరిస్తూ ఆరు నెలల వ్యవధిలో ఆమె నుంచి రూ.32 కోట్లు బదిలీ చేయించుకొన్నారు. అనంతరం నకిలీ క్లియరెన్స్ లెటర్‌ను కూడా జారీ చేసినట్లు బాధితురాలు పేర్కొన్నారు. . ఫిబ్రవరిలో ఆ డబ్బును తిరిగిస్తామని చెప్పిన అధికారులు ఎన్నిసార్లు అడిగినా నగదును తిరిగి పంపకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు నవంబర్ 14న పోలీసులను ఆశ్రయించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

