దివ్య హత్య కేసులో కొత్త ట్విస్ట్‌..అతడు ఓ సైకో అంటూ దివ్య పోస్ట్‌!

దివ్య హత్య కేసులో  కొత్త ట్విస్ట్‌..అతడు ఓ సైకో అంటూ దివ్య పోస్ట్‌!
ఇన్‌స్టాగ్రామ్‌లో దివ్య పోస్ట్‌ చేసిన వీడియో ద్వారా..ఈ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది.

ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడ దివ్య హత్య కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. దివ్యను తాను హత్య చేయలేదని.. ఇద్దరం ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో నిందితుడు నాగేంద్రబాబు తెలిపినట్టు తెలుస్తోంది. ఐతే ఈ కేసును విచారిస్తున్న పోలీసుల దర్యాప్తులో.. మరో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. మృతురాలు దివ్య, నిందితుడు నాగేంద్రబాబుకు ఇది వరకే వివాహం జరిగినట్టు పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో రహస్య ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరు.. 3నెలల పాటు విడికాపురం కూడా పెట్టినట్టు ప్రాథమిక విచారణలో తెలిసినట్టు సమాచారం. ఐతే ఇద్దరి కులాలు వేరుకావడంతో వీరి ప్రేమ వివాహాన్ని అంగీకరించని దివ్య తల్లిదండ్రులు.. కూతురిని ఇంటికి తీసుకొచ్చి 4నెలలుగా గృహనిర్బంధం చేసినట్టు తెలుస్తోంది.

నాగేంద్రబాబుతో దివ్యను దూరంగా ఉంచడానికి తల్లిదండ్రులు కూతురిని.. భీమవరం కాలేజీలో చదివించేందుకు పంపించారు. ఐతే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో కాలేజ్‌ నుంచి దివ్య ఇంటికొచ్చింది. దీంతో దివ్యను కాపురానికి తీసుకువెళ్లే విషయంలో మాట్లాడడానికి 2రోజుల క్రితం నిందితుడు నాగేంద్రబాబు.. ఆమె తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో...దివ్య తల్లిదండ్రులు నాగేంద్రబాబుతో వాగ్విదానికి దిగినట్టు సమాచారం. గురువారం దివ్య ఒంటరిగా ఉన్నవిషయం తెలుసుకున్న నిందితుడు నాగేంద్రబాబు ఇంటికి వెళ్లాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో.. కత్తితో దివ్యపై దాడి చేసి హతమార్చాడు. అటు నిందితుడు నాగేంద్రబాబుకు కూడా గాయాలయ్యాయి. అతన్నిఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న నాగేంద్రబాబు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. తాను దివ్యను హత్య చేయలేదని.. ఇద్దరం ఆత్మహత్యకు పాల్పడినట్టు స్టేట్‌మెంట్‌లో నాగేంద్రబాబు తెలిపినట్టు పోలీసులు పేర్కొన్నారు.

మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో దివ్య పోస్ట్‌ చేసిన వీడియో ద్వారా..ఈ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. నాగేంద్రబాబు ఓ సైకో అంటూ దివ్య పోస్ట్‌ చేయడం కలకలం రేపుతోంది. తాను రెండేళ్లుగా రిలేషన్‌లో ఉన్నానని.. తర్వాత అతడు సైకో అని తెలుకున్నానని ఆ వీడియోలో పోస్ట్‌ చేసింది. గత ఆర్నేళ్లుగా సైకోతో పోరాడుతున్నానంది. తనకు అన్న ఉన్నాడనే నమ్మకం ఉందని దివ్య పేర్కొంది. ఓ మహిళ వల్ల తాను మోసపోయానంది. దీంతో ఇప్పుడు ఈ కేసు అనేక అనుమానాలకు తావిస్తోంది.నిందితుడి స్టేట్‌మెంట్‌...దివ్య పోస్ట్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో ఆధారం.. విచారణలో కీలకం కానుంది.

సంచలనంగా మారిన దివ్య హత్య కేసుపై డీసీపీ హర్షవర్ధన్‌ స్పందించారు. హతురాలు, నిందితుడు నాగేంద్రబాబు గతంలో రహస్య ప్రేమ వివాహం చేసుకున్నట్టు.. నిందితుడు తెలిపినట్టు డీసీపీ పేర్కొన్నారు. నాగేంద్రబాబు పూర్తిగా కోలుకున్నాక.. దివ్య హత్య కేసులో ఏమి జరిగింది. నాగేంద్రబాబు ఎందుకింత దారుణానికి ఒడిగట్టాడన్న విషయాలు తెలుస్తాయన్నారు డీసీపీ హర్షవర్థన్‌.

Tags

Read MoreRead Less
Next Story