30 Sep 2022 10:50 AM GMT

Home
 / 
క్రైమ్ / Crime News: 'దృశ్యం'...

Crime News: 'దృశ్యం' సినిమా చూసి.. కన్నతండ్రిని కడతేర్చి..

Crime News:మూడు గంటల సినిమా మనిషిపై ప్రభావం చూపిస్తుందా.. ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో చర్చకు వస్తుంటుంది.

Crime News: దృశ్యం సినిమా చూసి.. కన్నతండ్రిని కడతేర్చి..
X

Crime News: మూడు గంటల సినిమా మనిషిపై ప్రభావం చూపిస్తుందా.. ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో చర్చకు వస్తుంటుంది. మంచి చెప్తే ఎక్కక పోవచ్చు. కానీ చెడు మాత్రం చాలా చక్కగా చెవికి ఎక్కించుకుంటారనేదానికి నిదర్శనం ఇది. సూపర్ హిట్ తమిళ్ మూవి దృశ్యం. దీన్ని తెలుగులో కూడా రీమేక్ చేశారు. వెంకటేష్, మీనా కధానాయకులు.

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా క్రైమ్ స్టోరీలు సినిమాకు రిలేటెడ్ గానే ఉంటాయి. అవి చూసి సినిమాలు తీస్తున్నారో.. సినిమాలు చూసి వీళ్లు నేర్చుకుంటున్నారో ఆ దేవుడికే తెలియాలి. మొత్తానికి కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన సినిమా చూసే చేశామని ఒప్పుకున్నారు సదరు వ్యక్తులు.

ఆ సినిమాలో కథానాయకుడు ఒక అబద్ధం చెప్పి కుటుంబాన్ని పోలీసుల నుంచి కాపాడుకుంటాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఒకే మాటపైనే ఉంటారు. ఆ విధంగా పోలీసులకు వివరాలు చెప్పకుండా హత్యా నేరం మోపకుండా సురక్షితంగా బయటపడతారు.

కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. దృశ్యం సినిమాను ఏకంగా పదిసార్లు చూసిన తల్లీ కూతుళ్లు.. తండ్రిని దారుణంగా హత్య చేశారు. పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి దృశ్యం సినిమా స్టైల్‌ను అనుసరించారు. చెప్పిన అబద్ధం మళ్లీ మళ్లీ చెప్పలేక చివరికి నిందితులు చేతులు ఎత్తేశారు. చివరకు పోలీసుల చేతికి చిక్కి అరెస్ట్ అయ్యారు.

కర్ణాటకలోని బెలగావికి చెందిన సుధీర్ కంబలే దుబాయ్‌లో ఉండేవాడు. అతని కుటుంబం స్థానికంగా నివసించేది. అయితే కరోనా కారణంగా సుధీర్ స్వగ్రామానికి చేరుకున్నాడు. అక్కడే ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు భార్య రోహిణి, కుమార్తె స్నేహ ఉన్నారు.

మహారాష్ట్రలోని పూణెలో స్నేహ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతోంది. ఆ సమయంలో స్నేహకు అక్షయ్ విట్కర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది.

కూతురి ప్రేమ గురించి తెలుసుకున్న సుధీర్ తన కుమార్తెను మందలించాడు. తమ ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని భావించిన స్నేహ.. అతడిని ఎలాగైనా తొలగించాలని ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని ఆమె తల్లికి చెప్పింది. ఆమె కూడా భర్త హత్యను ప్రోత్సహించింది.

సుధీర్‌ని హత్య చేయాలని పథకం వేశారు. అక్షయ్ విట్కర్‌ను పూణే నుంచి బెలగావికి పిలిపించారు. ఈ క్రమంలో సుధీర్ ఇంటి పై అంతస్తులో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో అక్షయ్‌ను తల్లి, బిడ్డ ఇంటికి పిలిపించారు.

నిద్రిస్తున్న సుధీర్ కాళ్లు, చేతులు తల్లీ కూతుళ్లు ఇద్దరూ గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు అక్షయ్ సుధీర్ ని.. పొట్ట, గొంతు, చేతులు, ముఖంపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. దాంతో అతడు మరణించాడు. సుధీర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్షయ్ తిరిగి పూణే వెళ్లిపోయాడు.

ఇక ఆ తరువాత కధ అంతా తాను నడిపిద్ధామనుకుంది సుధీర్ భార్య. తన భర్త సుధీర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారని రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు డీసీపీ రవీంద్ర విచారణ చేపట్టారు. ఇంటరాగేషన్‌లో ఎలాంటి ప్రశ్నలు వేసినా తల్లీ, కూతురు ఇద్దరూ ఒకే సమాధానాలు చెప్పారు. పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే వారి కాల్ డేటాను పరిశీలించారు.

స్నేహ అక్షయ్‌తో రెగ్యులర్‌గా మాట్లాడినట్లు తెలుసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పది సార్లు దృశ్యం సినిమా చూసి ఇలా పథకం వేశామని తల్లీ కూతుళ్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా పోలీసు వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Next Story