విశాఖకు తరలిస్తున్న రూ.8 కోట్ల దొంగనోట్ల కట్టలు సీజ్

విశాఖకు తరలిస్తున్న దాదాపు 8 కోట్ల రూపాయల దొంగనోట్ల కట్టలను సీజ్ చేశారు పోలీసులు. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలా దొంగనోట్లు పట్టుబడడం కలకలం రేపుతోంది. ఒడిశాలోని సుంకి గ్రామంలో ఆంధ్రా-ఒడిశా చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా కంటపడింది. వాహనాన్ని తనిఖీ చేయగా 7 కోట్ల 90 లక్షల విలువ చేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి.
ట్రాలీ బ్యాగ్‌లలో దొంగనోట్లను రాయ్‌పూర్ నుంచి విశాఖకు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. దొంగనోట్లను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఒడిశా పోలీసులు కారును సీజ్ చేశారు. ఎన్నికల్లో పంచడానికే దొంగనోట్లను విశాఖకు తరలిస్తున్నారా.. వేరే వ్యవహారం ఉందా అనే దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వీరి నుంచి 5 మొబైల్ ఫోన్లు, 35 వేల నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులు సీజ్ చేశారు. వీళ్ల ఐడీ ప్రూఫ్‌ల ఆధారంగా తెరవెనుక సూత్రధాలు ఎవరో కనిపెట్టేందుకు విచారణ మొదలుపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com