యూట్యూబ్‌ చూసి మహిళలకు అబార్షన్లు చేస్తున్న నకిలీ డాక్టర్

యూట్యూబ్‌ చూసి మహిళలకు అబార్షన్లు చేస్తున్న నకిలీ డాక్టర్
అతడో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌. చదివింది బీఎస్సీ. ఎంబీబీఎస్‌ వైద్యుడిగా అవతారమెత్తి వరంగల్‌ నగరం నడిబొడ్డున ఏకంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు.

అతడో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌. చదివింది బీఎస్సీ. ఎంబీబీఎస్‌ వైద్యుడిగా అవతారమెత్తి వరంగల్‌ నగరం నడిబొడ్డున ఏకంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు చేస్తూ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. యూట్యూబ్​చూసి వంటలు నేర్చుకోవడం, ఇతర క్లాసులు వినడం సహా అనేక అంశాలు నేర్చుకుంటాం. కానీ ఓ ప్రబుద్ధుడు ఏకంగా యూట్యూబ్​చూస్తూ అబార్షన్లు చేస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో బుధవారం అర్ధరాత్రి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడిచేసి పోలీసులకు అప్పగించారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి.. నెల రోజుల క్రితం హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదురుగా సిటీ హాస్పిటల్‌ పేరిట ఆసుపత్రి ప్రారంభించాడు. రెండోసారి ఆడ పిల్లలు వద్దనుకునే మహిళలను ఆర్‌ఎంపీలు, పీఎంపీల ద్వారా గుర్తిస్తున్నాడు. నర్సింగ్‌లో శిక్షణ పొందినవారి సాయంతో.. యూట్యూబ్‌ చూస్తూ అబార్షన్లు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో బుధవారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆసుపత్రిపై దాడి చేశారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆసుపత్రిపై దాడి సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు ఇంద్రారెడ్డి చికిత్స చేస్తున్నారు. అధికారులను చూసి వైద్య సిబ్బంది గోడదూకి పారిపోయారు. థియేటర్‌లో ఉన్న మహిళను బాత్రూంలో దాచారు. డీఎంహెచ్‌వో లలితాదేవి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో మదన్‌మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో యాకూబ్‌పాషాలు పోలీసుల సాయంతో ఆ మహిళను బయటకు తీసుకొచ్చి విచారించారు. రక్తస్రావం అవుతుండటంతో హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు.

డీఎంహెచ్‌వో ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిపై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఆసుపత్రిని జిల్లా వైద్య అధికారులు సీజ్‌ చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిపారు. ఇంద్రారెడ్డి మూడేళ్ల క్రితం వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలోనూ ఇలాగే ఓ ఆసుపత్రి ఏర్పాటు చేయగా.. అధికారులు దాన్ని సీజ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story