FedEx Crimes: : ఫెడెక్స్ స్కాం అంటే ఏంటో తెలుసా మీకు
రోజుకొక మార్గంలో నేరాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్ళు .. బాధితుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఫిషింగ్, అపరిచిత లింక్‌లు, ఆధార్ స్కామ్‌లు, ఫెడెక్స్ కొరియర్లంటు నమ్మించి నిలువున ముంచుతున్నారు. ఉన్న చోటు నుంచే బాధితుల ఖాతాల్లో ఉన్నదంతా ఉడ్చేయడం వారి లక్ష్యం. ఈ మోసాలు నగరంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ నేరాల నుంచి తప్పించుకునేందుకు మార్గాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
అసలు ఫెడెక్స్ స్కాం అంటే ఏంటి? మనకు సామాజిక మాధ్యమాల నుంచి సైబర్ నేరగాళ్లు ఆడియో కాల్ చేస్తారు. మీ పార్సిల్‌లో మీరు బుక్ చేసిన వస్తువులతో పాటు పలు మాదకద్రవ్యాలు, నకిలీ పాస్‌పోర్టులు లేదా నిషేధిత పదార్థాలు ఉన్నాయని బెదిరింపులకు గురిచేస్తారు. తర్వాత మీ గురించి ముంబయి సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేస్తామని చెబుతారు. తగ్గట్టుగానే కాసేపటికి వేరే నెంబర్ నుంచి ముంబయి సైబర్ క్రైమ్ నుంచి ఉన్నతస్థాయి అధికారిగా మాట్లాడి, భయాందోళనకు గురిచేస్తారు. తర్వాత స్కైప్ లాంటి యాప్‌లలో మానిటరింగ్ పేరిట గంటల తరబడి వీడియో కాల్ చేసి, మీపై కేసు నమోదైంది. అది కొట్టేయాలంటే ఇంత మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేసి, అమాయకుల నుంచి డబ్బులు లాగుతున్నారు. సైబర్ క్రైమ్‌కు సంబంధించి ఎలాంటి నేరాలు జరిగినా మొదటి గంటలో 1930కి ఫిర్యాదు చేయడం వల్ల నగదు బదిలీ కాకుండా ఆపవచ్చని, మీ నగదు మీకు చేరుతోందని పోలీసులతో పాటు బాధితులు తమ అనుభవాల్ని చెబుతున్నారు.
ఇటీవల సైబర్ నేరాల కేసులు హైదరాబాద్‌లో ఎక్కువగా జరుగుతున్నాయి. బాధితుల్లో 27 శాతం మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. పోలీసులు పేరిట ఇలాంటి కాల్స్ రావడంతో పరువు పోతుందనే భయంతో డబ్బు చెల్లిస్తున్నారు. ఇదే ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు కాస్త లాజికల్ గా ఆలోచిస్తే భయపడాల్సిన పని ఉండదని సీనియర్ IPS అధికారి సజ్జనార్ అంటున్నారు.
నగరానికి చెందిన 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు 10 రోజుల క్రితం ఓ ఫోన్ చేసి.. తాను బుక్ చేసిన పార్శిల్‌లో 5 పాస్‌పోర్టులు, 3 క్రెడిట్ కార్డులతో పాటు 200 గ్రాముల MMDA డ్రగ్ ఉన్నట్లు అగంతకులు తెలిపారు. అనంతరం ముంబయి క్రైమ్ బ్రాంచ్ అంటూ నమ్మించారు. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు 3 లక్షల 71 వేల 581 రూపాయలు చెల్లించాడు. తర్వాత మోసపోయినట్లు గుర్తించాడు. ఇదే తరహాలో చాలా మంది మోసపోతున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఆందోళన పడకుండా కాస్త అప్రమత్తంగా ఉంటే నేరాలను అరికట్టవచ్చని సైబర్ నిపుణులు అంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com