Crime News: సోనూసూద్ పేరుతో మోసం.. అకౌంట్‌లో రూ.95వేలు మాయం

Crime News:ఆపద వస్తే ఆయనే కళ్ల ముందు కనిపిస్తాడు.. అందరి బంధువు అతడే అనిపిస్తాడు.. అదే అలుసుగా తీసుకుని ఆన్‌లైన్‌లో మోసానికి పాల్పడుతున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే ఉన్న ఆమె అకౌంట్లో నుంచి రూ.95 వేలు ఖాళీ చేశాడు ఓ వ్యక్తి.. రాజమహేంద్రవరం భాస్కరనగర్ ప్రాంతానికి చెందిన డి. సత్యశ్రీకి ఆరు నెలల బాబు ఉన్నాడు. చిన్నారి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు.. ఇందు కోసం లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
ఆర్థిక స్థోమత లేని ఆమె సోషల్ మీడియా ద్వారా, బంధువులను, స్నేహితులను సాయం కోసం అర్థించింది. ఇదే అదనుగా భావించి ఓ వ్యక్తి జూన్ 27న సత్యశ్రీకి ఫోన్ చేసి, సోనూసూద్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానని, ఆర్థిక సాయం చేస్తానని నమ్మించాడు. దీంతో ఆమె బ్యాంకు వివరాలు తెలియజేస్తానని చెప్పింది. దానికి అతడు అవేమీ అవసరం లేదు ఎనీడెస్క్ యాప్ ఇన్‌స్టాల్ చేసి వివరాలు నమోదు చేయమని సూచించాడు. దాంతో ఆమె పూర్తి వివరాలు యాప్‌లో నమోదు చేసింది. డబ్బు పంపించకపోగా.. ఆమె అకౌంట్లో నుంచి రూ.95వేలు మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com