ప్రాణం తీసిన స్నేహం.. ఆదివారం అర్థరాత్రి అన్యాయంగా ఆశ్రిత..

ప్రాణం తీసిన స్నేహం.. ఆదివారం అర్థరాత్రి అన్యాయంగా ఆశ్రిత..
X
పెళ్లి రోజు, పుట్టిన రోజు, స్నేహితుల దినోత్సవం.. వేడుక ఏదైనా మద్యం కామన్. తాగి డ్రైవ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వార్తలు ఎన్ని చూసినా యధా మామూలే.

పెళ్లి రోజు, పుట్టిన రోజు, స్నేహితుల దినోత్సవం.. వేడుక ఏదైనా మద్యం కామన్. తాగి డ్రైవ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వార్తలు ఎన్ని చూసినా యధా మామూలే. ఏం జరుగుతుందన్న ధీమాలే అమ్మానాన్నల కడుపుకోతకు కారణమవుతున్నాయి. విదేశాల్లో చదువుకుంటూ స్వదేశానికి వచ్చిన ఆశ్రిత ఫ్రెండ్‌షిప్ డే అని ఆదివారం స్నేహితుల్ని కల్సుకోవడానికి వెళ్లింది. అదే ఆమెకు ఆఖరి రోజయ్యింది.

తెల్లాపూర్‌కు చెందిన డి.వినయ్ కుమార్ ఎంఆర్ఎఫ్ ఉద్యోగి. ఆయన ఒక్కగానొక్క కుమార్తె ఆశ్రిత. గత ఏడాది బిబిఏ పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసమని కెనడా వెళ్లింది. ఆశ్రితకు తరుణి, సాయి ప్రకాష్, అభిషేక్, వివేక్, చిన్మయ్ అని అయిదుగురు స్నేహితులు ఉన్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో వారందరినీ కలుద్దామని ఆశ్రిత వెళ్లింది. ఆ రోజు రాత్రి 10 గంటలకు మాదాపూర్ హైటెక్స్ రోడ్డులోని పబ్‌కు వెళ్లారు.

అభిషేక్, సాయిప్రకాష్ మద్యం తాగారు. రాత్రి 11 గంటలకు మదీనాగూడలోని అభిషేక్ ఇంటికి బయలుదేరారు. కారు అతడే డ్రైవ్ చేస్తున్నాడు. రాత్రి 11.30 ప్రాంతంలో కారు అదుపు తప్పి బండరాళ్లను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. కారు డోర్ తెరుచుకోవడంతో ఆశ్రిత రోడ్డుపై ఎగిరి పడింది. తరుణి కారు లోపల ఇరుక్కుపోయింది. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో సాయి ప్రకాష్, అభిషేక్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.

గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆశ్రిత మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. తరుణి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అభిషేక్ మద్యం తాగి కారు డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మద్యం విక్రయాలపై నిషేధం ఉన్నా విక్రయించినందుకు స్నార్ట్ పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Next Story