Atchutapuram gas leak : బ్రాండిక్స్ గ్యాస్ లీక్.. చికిత్స పొందుతున్న బాధితులు..
Atchutapuram gas leak : అచ్యుతాపురం బ్రాండిక్స్‌లో గ్యాస్ లీక్ మరోమారు కలకలం రేపింది. సీడ్స్ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీతో పెద్ద సంఖ్యలో మహిళలు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు నెలల వ్యవధిలో రెండోసారి గ్యాస్ లీకేజీతో సిబ్బంది జంకుతున్నారు.
బ్రాండిక్స్ గ్యాస్‌లీక్ బాధితులకు చికిత్స అందిస్తున్న ఎన్టీఆర్ ఆస్పత్రి ముందు భారీగా పోలీసులను మోహరించారు. నిరసనలకు తావులేకుండా పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. మరోవైపు బాధితులను పరామర్శించేందుకు కార్మిక సంఘాల ప్రతినిధులు ఆస్పత్రులకు చేరుకుంటున్నారు.
జూన్ 3న జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై నివేదిక రాకముందే మరో ప్రమాదం జరగడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు ఆస్పత్రిలో వైద్యం చేయించి, ఆక్యుపేషనల్ హెల్త్ డిసీజ్‌ల కింద పరిగణించి, యాజమాన్యాలు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అసలు రెండు నెలల క్రితం జరిగిన ప్రమాదంపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
పదే పదే విషవాయువు లీక్ అవడానికి సేఫ్టీ ఆడిట్ చేపట్టకపోవడమేనని ఆరోపిస్తున్నారు. పైగా ప్రభుత్వ అండదండల వల్లే యాజమాన్యానికి భయం లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. గతంలో హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ గ్యాస్ లీక్ అయిందో పసిగట్టే నిపుణత.. ఇక్కడి అధికారులకు ఎందుకు లేదో చెప్పాలన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com