Ghatkesar Incident..ఘట్‌కేసర్ యువతి ఘటన.. సమాజానికి ఏం చెబుతోంది!
Ghatkesar Incident
Ghatkesar Incident.. తనను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ చెప్పి ఇటీవల కలకలం సృష్టించిన బీఫార్మసీ యువతి అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఘట్‌కేసర్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆమె.. అక్కడ షుగర్ టాబ్లెట్లు మింగి ప్రాణాలు తీసుకుంది. కిడ్నాప్ సీన్ మొత్తం అబద్ధమని పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టడంతో యువతి మానసికంగా కుంగిపోయింది. ఘటన తరువాత నుంచి డిప్రెషన్‌లోకి వెళ్లింది. చివరికి.. ఆ మానసిక సంఘర్షణతోనే తనువు చాలించించినట్టు కుటుంబసభ్యులు చెప్తున్నారు.
ఘట్‌కేసర్ యువతి మరణానికి ఓ అబద్దమే కారణం. చిన్నప్పటి నుంచి కిడ్నాప్ స్టోరీలపై ఉన్న ఇష్టం.. ఇంత పని చేసింది. కిడ్నాప్ జరిగిందని, రేప్ చేశారని చెబితే.. ఈ లోకం ఎలా తన గురించి ఎలా మాట్లాడుకుంటుందో చూద్దామని.. తనకు తానే ప్రాంక్ చేసుకుంది. పోలీసులకు ఓ సవాల్ విసిరింది. పైగా ఇంట్లో గొడవలు కూడా కిడ్నాప్ డ్రామాకు ఓ కారణమయ్యాయి. ఇంటికి లేట్‌గా వెళ్తే అమ్మ రానిస్తుందో లేదోనన్న అనుమానం, భయం.. ఏకంగా ఓ కథను అల్లేలా ప్రేరేపించింది. చివరికి ఆ వివాదం అనూహ్య మలుపులు తిరగడంతో చివరికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై, అవమాన భారంతో సూసైడ్ చేసుకుంది.
పిల్లల చుట్టూ అల్లుకుంటున్న భావాలను కనిపెట్టాల్సిన అవసరం ఎంత ఉందో ఈ ఘటన చెబుతోంది. గతంలోనూ తనను కిడ్నాప్ చేశారంటూ స్నేహితురాలికి చెప్పింది. అది జస్ట్ థియరీ మాత్రమే. ఈసారి ప్రాక్టికల్‌గా చేసి చూపించింది. చివరికి అవమానభారంతో బలవన్మరణానికి పాల్పడింది. అందుకే, ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, బయటికెళ్లాక ఎలా ప్రవర్తిస్తున్నారనే చిన్న వాకబు చేస్తూ, ఇంటికొచ్చాక వారితో మనసారా మాట్లాడితే ఇలాంటి పరిస్థితులు రావని మానసిక విశ్లేషకులు చెప్తున్నారు.
ఫార్మసీ విద్యార్ధినిగా... జరగబోయే పరిణామాలను కనీసం ఆలోచించకపోవడం కూడా తప్పే. కిడ్నాప్, రేప్ అనే కట్టుకథలో ఎంత సీరియస్‌నెస్ ఉందో ఆలోచించలేకపోయింది. అసలే ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్న రోజులు. ఇలాంటి సమయంలో అత్యంత సున్నితమైన అంశంపైనే ప్రాంక్ చేసింది. విషయం పోలీసుల వరకు వెళ్తే నిజం బయటపడుతుందని ఆలోచించలేక చివరికి తాను సృష్టించిన అబద్దానికి తానే బలైపోవడం అత్యంత విషాదం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com