Hyderabad: బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం

ఘట్‌కేసర్ బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. దీంతో 16 గంటల ఉత్కంఠకు తెరపడింది. పాపను ఎత్తుకెళ్లిన కిడ్నాపర్ సురేష్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
ఘట్‌కేసర్‌లోని EWS కాలనీకి చెందిన చిన్నారి కృష్ణవేణి నిన్న రాత్రి 8గంటల సమయంలో సమీపంలోని దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఇక పాప ఎంత సేపటికి ఇంటికి రాకపోవడం.. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి నుంచి ముమ్మరంగా గాలించారు. సీసీ పుటేజ్ ఆధారంగా చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టారు. సీసీ కెమెరాలో నిందితుడు సురేష్ పాపని ఎత్తుకెళ్లినట్లు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. పలు బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని పీఎస్‌లను అలర్ట్ చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు సికింద్రాబాద్ స్టేషన్‌లో పాపను సేఫ్‌గా కాపాడారు. రైల్వే స్టేషన్ నుంచి పాపను ఘట్‌కేసుర్‌కు తీసుకెళ్లిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సురేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com