Nalgonda : నల్గొండలో ప్రేమోన్మాది దాడి.. విషమపరిస్థితిలో యువతి..

Nalgonda : నల్గొండలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. యువతి శరీరంపై ఎనిమిది గాయాలు గుర్తించిన డాక్టర్లు సర్జరీ పూర్తి చేశారు. కత్తితో పొడవడంతో కడుపులో తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ ఏరియాకు చెందిన విద్యార్థిని..స్థానిక NG కాలేజీలో BBA పూర్తి చేసింది. ఇదే కాలేజీలో మీసాల రోహిత్ అనే యువకుడు సెకండియర్ చదువుతున్నాడు. ఐతే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో తనను ప్రేమించాలంటూ యువతిని కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నాడు.
తనకు ఇష్టం లేదని యువతి తిరస్కరించడంతో...ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే దుర్బుద్ధితో రోహిత్ తన స్నేహితుడు సాయిని సంప్రదించాడు. సాయితో యువతిని ఓ పార్కుకు రప్పించాడు. అప్పటికే అక్కడ రోహిత్‌ను చూసిన యువతి వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించింది. కాసేపు మాట్లాడుకుందాని రోహిత్ అడగడంతో పక్కకు వెళ్లింది. ఇదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అప్పటికే తన వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో యువతిపై దాడి చేశాడు రోహిత్. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని సాయి, మరో స్నేహితురాలు వెంటనే ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చారు.
ప్లాన్ ప్రకారమే యువతిపై రోహిత్ దాడి చేశాడన్నారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దాడికి గల కారణాలపై విచారిస్తున్నారు. దాడి విషయం నిందితుడు రోహిత్ స్నేహితుడు సాయికి ముందే తెలుసా....అనే విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. రోహిత్ గత చరిత్రపైనా దర్యాప్తు చేస్తున్న పోలీసులు...ఈ కుట్ర కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. ఐతే.. రోహిత్‌ను కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి పేరెంట్స్, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com