Crime News: ప్రేమ పేరుతో వెంటపడి.. ప్రేమించట్లేదని పెట్రోల్ పోసి..
Jharkhand: మనుషులు మృగాల్లా తయారవుతున్నారు.. హృదయంలో నుంచి పుట్టాల్సిన ప్రేమను బలవంతంగా సంపాదించుకోవాలనుకుంటున్నారు..అది ఒక వస్తువు అయితే తీసుకోవచ్చు. కానీ మనసులో కలిగే భావన అని తెలిసి కూడా విలన్‌లా వెంటపడుతున్నారు. ఆమె హృదయంలో చోటు దక్కించుకోలేకపోయినందుకు ప్రాణాలు తీయడానిక్కూడా వెనుకాడ్డం లేదు.. ఆమె ఆర్తనాదాల్లో పైశాచికానందాన్ని పొందుతున్నారు.
జార్ఖండ్‌లోని దుమ్కాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న బాలిక వెంటపడ్డాడు ప్రేమించమని ఓ ఆకతాయి. అయితే ఆమె అతడి ప్రేమను నిరాకరించింది. దాంతో అతడు ఆగ్రహం చెందాడు. అదను కోసం వేచి చూసాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమె గది కిటికీ బయట నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 90 శాతం కాలిన గాయాలతో విషమ పరిస్థితిలో దుమ్కాలోని ఫూలో జానో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మొదట చేరింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, నిందితుడు 10 రోజుల క్రితం తన మొబైల్‌కు కాల్ చేశాడని మహిళ తెలిపింది. "సోమవారం రాత్రి 8 గంటల సమయంలో అతను మళ్లీ నాకు ఫోన్ చేసి, నేను అతనితో మాట్లాడకపోతే నన్ను చంపేస్తానని చెప్పాడు. బెదిరింపు గురించి నేను మా నాన్నకు తెలియజేశాను. ఆ తర్వాత అతను మంగళవారం ఆ వ్యక్తి కుటుంబంతో మాట్లాడతానని హామీ ఇచ్చాడు. రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాం. నేను వేరే గదిలో పడుకున్నాను.
"నా వెనుక భాగంలో నొప్పి ఏదో కాలిపోతున్నట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి అతను పారిపోతున్నాడని నాకు అనిపించింది. నొప్పితో అరుస్తూ నాన్న గదిలోకి వెళ్ళాను. నా తల్లిదండ్రులు మంటలను ఆర్పి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు, "పోలీసులు తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నప్పుడు మహిళ చాలా కష్టంగా మాట్లాడింది. అనంతరం ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకువెళుతుండగా అతడిలో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించలేదు.. పైగా నవ్వుతూ వెళుతున్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com