కీచక పాస్టర్.. చర్చికి వచ్చే అమ్మాయిలను..

హైదరాబాద్ ఉప్పల్‌లో కీచక పాస్టర్ దారుణం వెలుగులోకి వచ్చింది. మూడు పెళ్లిళ్లు చేసుకుని యువతులను మోసం చేసిన కేసులో పాస్టర్ జోసెఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీ ఛానెళ్లలో మత ప్రభోదకుడిగా పనిచేస్తున్న జోసెఫ్.. చర్చికి వచ్చే అమాయక ఆడపిల్లలను లొంగదీసుకుని లైంగిక దాడి చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు యువతులు పాస్టర్ జోసెఫ్‌పై మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు పాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
బోడుప్పల్‌లోని లక్ష్మీ నగర్‌లో నివాసముండే చిన్న వెంకటేశ్వర్లు అలియాస్ జోసెఫ్ క్రైస్తవ మత ప్రబోధకుడిగా కొనసాగుతున్నాడు. ఉప్పల్‌లోని గోస్పల్ చర్చిలో పాస్టర్ గా పనిచేస్తున్నాడు.
అక్కడికి దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న యువతి తరచు గోస్పల్ చర్చికి వెళ్ళేది. ఆమెపై కన్నేసిన జోసెఫ్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. గతేడాది జనవరి 23వ తేదీన శంషాబాద్‌లోని చర్చికి వెళదాం రమ్మని ఆమెను కూడా కారులో తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి యువతిని బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పగా వారు పాస్టర్‌ని నిలదీసి పోలీస్ కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని జోసెఫ్ హామీ ఇచ్చాడు.
అయితే కాలం గడుస్తున్నా పాస్టర్ పెళ్లి మాట ఎత్తకపోవడంతో బాధితురాలు ఈ నెల రెండో తేదీన పాస్టర్ ఇంటికి వెళ్లి అతడిని నిలదీసింది. దీంతో పాస్టర్ కుటుంబసభ్యులకు, యువతికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విషయం బయట పెడితే చంపేస్తామంటూ జోసఫ్ తండ్రి, సోదరుడు బాధితురాలిని బెదిరించారు. బాధిత యువతి అక్కడి నుంచి నేరుగా మేడిపల్లి పీఎస్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాస్టర్ ఇప్పటికే మూడు పెళ్లి చేసుకున్నాడని యువతుల జీవితాలతో ఆడుకుంటాడని తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com