Crime News: 'అమ్మమ్మ'కు చేతులెలా వచ్చాయి.. పసికందును నేలకేసి కొట్టి..

Crime News: అమ్మ మాట వినకుండా కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ కోపం అమ్మలో నరనరాన జీర్ణించుకు పోయింది. అవకాశం కోసం ఎదురు చూసింది. కూతురుకు పుట్టిన 28 రోజుల పసిబిడ్డను నేలకేసి కొట్టి చంపేసింది.
ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటు చేసుకుంది. సత్తగారి సూర్యకళకు భర్తలేడు. కూలి పనులు చేసుకుంటూ బిడ్డలను పోషించుకుంటోంది. ఈ క్రమంలో ఎదిగిన కూతురు మౌనిక రెండేళ్ల క్రితం నర్సింలు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఆమె ఎనిమిది నెలల గర్భంతో ఉన్నప్పుడు భర్త మృతి చెందాడు. దీంతో మౌనిక తల్లితో ఉంటోంది. 28 రోజుల క్రితం మౌనిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి తల్లీకూతుళ్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం కూడా ఇద్దరూ గొడవపడ్డారు. అది కాస్తా పెరిగింది.
ఆగ్రహించిన సూర్యకళ కోపంతో కూతురు ఒడిలో ఉన్న పసికందును బలవంతంగా లాక్కుని విచక్షణ కోల్పోయి నేలకేసి కొట్టింది. పాపం పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. ఆవేశం ఎంతటి అనర్ధానికి దారితీస్తుందో ఈ సంఘటన తెలియజేస్తుంది.
ఒంటరి జీవితం గడుపుతున్న మౌనిక బిడ్డ మరణం మరింత దు:ఖాన్ని మిగిల్చింది. గుండెలవిసేలా రోదిస్తున్న మౌనికను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఈ మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com