హత్రాస్ సామూహిక అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

హత్రాస్ సామూహిక అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
X

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన నిర్భయ తరహా ఘటనలో అత్యాచారానికి గురై మరణించిన యువతికి నిన్న అర్థరాత్రి రెండున్నరకు.. ఆమె స్వగ్రామం హత్రాస్‌లో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా... అర్థరాత్రి దాటాక.. రహస్యంగా ఖననం చేశారు. ఢిల్లీ నుంచి బాధితురాలి మృతదేహాన్ని హత్రాస్ తీసుకెళ్లిన పోలీసులు.. డెడ్‌బాడీని ఆమె ఇంటికి కూడా తీసుకెళ్లలేదు. ఉద్రిక్తత పరిస్థితులవల్ల... 20 ఏళ్ల ఆ యువతి అంత్యక్రియల్లో.. కుటుంబ సభ్యులు, బంధువులను కూడా పోలీసులు అనుమతించలేదు. కడసారి చూస్తామని బతిమిలాడినా పోలీసులు వినలేదు. పోలీసులు అంత్యక్రియలకు అనుమతించకపోవడంపై... యువతి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామూహిక అత్యాచారానికి గురై శారీరక, మానసిక వేదనతో... ఆ దళిత యువతి.. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో కన్నుమూసింది. ఈ నెల 19న జరిగిన ఈ ఘోరఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతిని ముందుగా ఆలీగఢ్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నాలుక తెగిపోయి, వెన్నెముకకు గాయాలతో, చేతులు పాక్షికంగా, కాళ్లు పూర్తిగా చచ్చుబడిన ఆమె పరిస్థితి మెరుగుకాకపోవడంతో... మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించారు. తల్లితో కలిసి పొలానికి వెళ్లిన ఆమె.. అక్కడి నుంచి అదృశ్యమైంది. పశువుల మేత కోసం కాస్త దూరం వెళ్లిన ఆమె.. నలుగురు నిందితులు లాక్కునిపోయి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించాలని ప్రయత్నించిన ఆమెను.. చున్నీతో గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆమె నాలుక తెగిపోయిందని ఫిర్యాదు నమోదైంది.

దళిత యువతి అత్యాచార ఘటనపై రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయి. ఢిల్లీలోని ఆసుపత్రి వద్ద అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. రేపిస్టులను ఉరితీయాలని ఆసుపత్రి వెలువల నినాదాలు చేశారు. ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగిన ఆ యువతికి తండ్రి, సోదరుడిని యూపీ నెంబర్ ప్లేట్లతో ఉన్న పోలీసు వాహనాల్లో బలవంతంగా తరలించారు. యూపీ సర్కార్ వైఫల్యంపై.. విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. యూపీ రేపిస్ట్ కేపిటల్‌గా మారిందని పలు ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు.

దారుణ అత్యాచార ఘటనలో నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం- SIT ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వారం రోజుల్లో దర్యాప్తు చేసి SIT తన నివేదిక ఇస్తుందని యోగీ తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా విచారణ జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు యూపీ సీఎం. ఈ ఘటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం యోగికి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మోదీ సూచించారు.

Tags

Next Story