తనను బలవంతంగా హిజ్రాగా మారుస్తున్నారని యువకుడు ఆత్మహత్య!

కడపలో ఓ హిజ్రా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను బలవంతంగా పూర్తిస్థాయి హిజ్రాగామార్చేందుకు సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నారంటూ సెల్ఫీవీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు శ్రీకాంత్ అలియాస్ ప్రసాద్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నక్కల బండ తండా. శ్రీకాంత్ తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో నక్కల బండ తండాలోని అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. ఏడాదిన్నరక్రితం మహబూబ్‌నగర్ లో చదువుకున్న సమయంలో దేవుడికి మొక్కు ఉందంటూ జుట్టుపెంచుకున్నాడు. ఈ క్రమంలో పనిచేసేందుకు వెళ్లిన శ్రీకాంత్ .. రెండు నెలక్రితం తన తమ్ముడికి ఫోన్ చేసి కడపలో ఉన్నట్లు తెలిపాడు.
ఈనెల 4న ఆడవేశంలో తన మేనమామ కొడుకు వినోద్‌కు వీడియోకాల్ చేసిన శ్రీకాంత్.. తనకు స్త్రీ లక్షణాలు ఉన్నాయని హిజ్రా ఆడవేశం వేయించి శ్రీలేఖ పేరు పెట్టినట్లు తెలిపాడు. తనకు ఇష్టం లేకపోయినా.. పూర్తిస్థాయిలో హిజ్రాగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తంచేశాడు. తనలాగే ఇక్కడ జడ్చర్ల, దేవరకద్ర, కోయిలకొండకు చెందిన యువకులు హిజ్రాల చెరలో ఉన్నారని వాపోయాడు. మీరు ఇక్కడికి వస్తే.. హిజ్రాలు చంపేస్తారని హెచ్చరించిన శ్రీకాంత్ .. ఫోన్‌లో మాట్లాడుతూనే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొన ఊపిరితోఉన్న శ్రీకాంత్‌ను తోటి హిజ్రాలు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. శ్రీకాంత్ అంత్యక్రియలు చేశారో లేదో తమకు తెలియదని..డెడ్ బాడీ ఇచ్చేందుకు హిజ్రాలు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారని మృతుడి బంధువులు వాపొయ్యారు.
అయితే హిజ్రా శ్రీకాంత్ ఆత్మహత్యపై కడప పోలీసులు మరో వాదన వినిపిస్తున్నారు. శ్రీకాంత్ కడపలో రవి అనే యువకుడితో ప్రేమవ్యవహరం నడిపి సహజీవనం సాగించారని పేర్కొన్నారు. అతడు మోసం చేయడంతో శ్రీకాంత్ ఆత్మహత్యచేసుకున్నట్లు ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మౌనిక అనే హిజ్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com