Crime News: వార్డెన్ ఫోన్ ఇవ్వలేదు.. అమ్మకి బర్త్ డే విషెస్ చెప్పలేదు.. మనస్థాపంతో విద్యార్థి ఆత్మహత్య

Crime News: క్షణికావేశంలో యువత ప్రాణాలు తీసుకుంటున్నారు.. ఆత్మహత్యలు చేసుకుని నిండు జీవితాలకు ముగింపు పలుకుతున్నారు.
తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు అనుమతించకపోవడంతో ఓ మైనర్ పాఠశాల హాస్టల్‌లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. తన తల్లికి కాల్ చేయడానికి తన హాస్టల్ వార్డెన్ మొబైల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించడంతో బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బెంగళూరులోని హోసాకోట్‌లో నివాసముంటున్న పూర్వజ్ (14) జూన్ 11న తన తల్లికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు కాల్ చేయాలని మొబైల్ ఫోన్ కోసం వార్డెన్ ని అభ్యర్థించగా నిరాకరించాడు.
అతని కుటుంబసభ్యులు కూడా ఆ రోజు పూర్వజ్ తో మాట్లాడడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కానీ వార్డెన్ అతడితో మాట్లాడేందుకు అనుమతించలేదు. దాంతో తల్లిదండ్రులు కూడా కొడుకుతో మాట్లాడలేకపోయారు.
ఈ సంఘటనతో నిరుత్సాహానికి గురైన యువకుడు శనివారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం పూర్వజ్ హాస్టల్‌లో శవమై కనిపించడంతో ఇతర విద్యార్థులు గమనించి వెంటనే హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించారు.
బాలుడి తల్లిదండ్రులు సాయంత్రం హాస్టల్‌కు చేరుకుని భోరున విలపిస్తున్నారు. వార్డెన్ నిర్వాకం వల్లే తమ కొడుకు ప్రాణాలు పోయాయని కన్నీరు మున్నీరవుతున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. హాస్టల్ గదిలో పూర్వజ్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com