Hyderabad : డేటా చోరీ కేసులో ఎంటరైన ఈడీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తిగత డేటా చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. FIR ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 17 కోట్ల మందికి చెందిన డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
అత్యంత కఠినమైన PMLA చట్టం కింద కేసు నమోదు చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని డిఫెన్స్, నిఘా అధికారులు సైబరాబాద్ పోలీసులతో ఈడీ అధికారులు సమావేశమయ్యారు. ఒక మహిళతో సహా ఏడుగురిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఆధార్, పాన్, మొబైల్ నెంబర్స్ సహా 18 రకాల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అందినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలకు చెందిన రహస్య సమాచారమంతా చోరీకి గురైనట్టు అనుమానిస్తున్నారు.
డేటాకు చోరికి పాల్పడే ముఠాను గత వారం సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల డేటా బేస్, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్సూరెన్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి వివరాలన్నీ ఈ ముఠా బహిరంగ మార్కెట్ లో అమ్మకానికి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో కొందరు 10 రూపాయల నుంచి 40 రూపాయలకు కూడా పౌరుల సున్నితమైన సమాచారాన్ని అమ్మినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఔట్ సోర్సింగ్ కింద సేవలందిస్తున్న ఢిల్లీకి చెందిన ఐటీ కంపెనీల పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డేటా చోరీలో బ్యాంకుల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com