Hyderabad : వ్యాపారి కుమారుడిని చంపిన హిజ్రా

హైదరాబాద్‌లోని సనత్ నగర్ పరిధిలో ఓ మైనర్ బాలుడు హత్యకు గురయ్యాడు. అల్లాదున్ కోటిలో నివసించే రెడీమేడ్ దుస్తుల వ్యాపారి వసీంఖాన్ కుమారుడిని ఓ హిజ్రా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బుల విషయంలో తలెత్తిన గొడవ నేపధ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. చిట్టీల వ్యాపారం నిర్వహించే హిజ్రా దగ్గర వసీంఖాన్ చిట్టీలు వేశాడు. ఈనేపధ్యంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ నేపధ్యంలో నిన్న సాయంత్రం వసీంఖాన్ కుమారుడిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాలుడిని ప్లాస్టిక్ సంచిలో తీసుకుని హిజ్రా ఇంటి వైపునకు వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డ్ అయింది. బాలుడు కనిపించకపోవడంతో తండ్రి వసీంఖాన్ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం, సీసీ ఫుటేజీల ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు.
బాలుడిని చంపి మృతదేహాన్ని దగ్గరలోని ఓ నాలాలో పడవేసినట్లుగా విచారణలో ఒప్పుకున్నారు. ఓ ప్లాస్టిక్ సంచిలో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. బాలుడిని హత్య చేసిన నిందితులు.. ఎముకలు విరిచి ఓ బకెట్‌లో కుక్కారు.బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా స్ధానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిట్టీ డబ్బుల గొడవ కారణంతోనే హత్య చేసినట్లు పోలీసులు చెపుతున్నారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనతో అల్లాదున్ కోటి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com