మొన్న యూట్యూబర్.. నేడు ఇన్‌స్టాగ్రామర్.. లైకుల కోసం లైఫ్‌ని..

అర చేతిలో ఫోన్ అన్నీ చూపించేస్తుంది.. ప్రాణాలూ తీసేస్తుంది. ఏదో చెయ్యాలి.. ఎవరినో మెప్పించాలి.. లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ వీటి చుట్టే తిరుగుతోంది నేటి యువత.. యూట్యూబ్ వీడియోల కోసం, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. స్పీడ్‌గా వెళ్తున్న రైలు దగ్గర నిలబడి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేయాలనుకున్నాడు.. ఈ క్రమంలో అతడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
సనత్ నగర్‌లో 9వ తరగతి చదువుతున్న మహ్మద్ సర్ఫరాజ్ (16) రైలు పట్టాలపై ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేస్తున్నాడు. అదే సమయంలో అటుగా వస్తున్న రైలు ఢీకొని మృతి చెందాడు. అతను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం వీడియోను చిత్రీకరిస్తున్నాడు. ట్రాక్‌కి దగ్గరగా నిలబడి ఉన్నాడు. సర్ఫరాజ్ స్నేహితులు తమను తాము రక్షించుకునేందుకు దూరంగా వెళ్లగా, సర్ఫరాజ్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
రెండు గంటల తరువాత, అతని సహవిద్యార్థులు ముజమ్మిల్, సోహైల్ ఇద్దరూ సర్ఫరాజ్ ఇంటికి వెళ్లి జరిగిన సంఘటన వివరించారు. సర్ఫాజ్ తల్లీదండ్రి భోరున విలపిస్తూ సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా కొడుకు శవమై కనిపించాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. పోలీసులు మృతుడి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com