చదువుకుంటానంటే పెళ్లి చేశారు.. బాధతో నవ వధువు బలవన్మరణం

ఉన్నత చదువులు చదువులు చదివి మంచి ఉద్యోగం చేయాలని ఎన్నో కలలు కంది.. కానీ ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. అమ్మకి ఆరోగ్యం బాగాలేదని ఓపిక ఉన్నప్పుడే పిల్ల పెళ్లి జరిగితే చూడాలనుకుంది.. అందుకే కూతురికి నాలుగు అక్షింతలు పడేలా చేసింది. అత్తారింటికి పంపించింది. కాళ్ల పారాణి కూడా ఆరకముందే పదహార్రోజుల పండగ పూర్తి చేసుకుని అమ్మగారింటికి వచ్చిన ఆ యువతి తన ఆశలు అడియాసలయ్యాయని భావించింది. తనకు ఇక చదువుకునే అవకాశం లేదనుకుంది. పురుగు మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా అమ్మానాన్న వినకుండా వివాహం చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగయ్యబంజర్ గ్రామానికి చెందిన శ్రీను, పద్మ దంపతుల కుమార్తె దేవకి(23). ఆమె ఇటీవలే బీఎస్సీ పూర్తిచేసింది.
అనంతరం ఉన్నత చదువులు చదువుకుంటానని తల్లికి చెప్పింది. తల్లి.. తనకు ఆరోగ్యం బాగుండటంలేదని కుమార్తెకు నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. దుబ్బతండా గ్రామానికి చెందిన యువకుడితో గతనెల 28న వివాహం జరిగింది. పదహారు రోజుల పండగకు పుట్టింటికి వచ్చిన దేవకి ఈ నెల 14న రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. అయినా పరిస్థితి విషమంగా ఉందని భావించిన వైద్యులు ఆమెను ఖమ్మం వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు అతడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com