Crime News: వివాహేతర సంబంధాలు.. ఇంజక్షన్ మర్డర్లు..
Crime News: వివాహ బంధానికి అర్ధం మారిపోతుంది.. వివాహేతర సంబంధాలకు అడ్డువస్తున్నారని కట్టుకున్న వారినే కడతేరుస్తున్నారు..ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటనలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.. గొడవలతో విసిగిపోయిన ఓ వ్యక్తి తన రెండో భార్యను హతమార్చాలని పథకం చేసి ఇంజక్షన్‌తో చంపేస్తే.. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య మత్తు మందుతో భర్తను చంపిచింది ఓ భార్య..
50 రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం నగరంలోని ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా, అనస్థీసియా డాక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి మొదట తన మేనకోడలితో పెళ్లి అయింది. పిల్లలు కలగలేదు. దీంతో తన కంటే 20 ఏళ్లు చిన్నదైన నవీనను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు ముగ్గురు అన్యోన్యంగానే ఉన్నారు. నవీనకు పాప పుట్టింది. తర్వాత సవతుల మధ్య గొడవలు మొదలయ్యాయి.
గొడవలతో విసిగిపోయిన భిక్షం రెండో భార్య నవీనను హతమార్చాలని పథకం వేశాడు. ప్రసవం కోసం జూలై 30న ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. ఆడశిశువు పుట్టింది. మరసటి రోజు తెల్లవారే సరికి నవీన ఆస్పత్రిలోనే చనిపోయింది. సరిగ్గా వైద్యం చేయకపోవడం వల్లే తన భార్య చనిపోయిందంటూ భిక్షం తన బంధువులతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. అయితే హాస్పటల్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రసవం జరిగిన రోజు అర్ధరాత్రి 2గంటల సమయంలో భిక్షం తన భార్య నవీనకు ఇంజక్షన్ ఇవ్వడం, ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వెళ్లి హడావుడి చేయడం
కనిపించాయి. నిర్ఘాంతపోయిన ఆస్పత్రి యాజమాన్యం ఖమ్మం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల బిక్షంను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. నవీనకు ఇంజక్షన్ ద్వారా అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి చంపినట్టు ఒప్పుకున్నాడు. రెండు వారాల క్రితమే పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఇదే మాదిరిగా ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసిన జమాల్‌సాహెబ్ ఘటనతో ఇది వెలుగులోకి వచ్చింది.
జమాల్‌సాహెబ్ హత్యకు ప్రధాన సూత్రధారి అతని భార్య షేక్ ఇమామ్‌బీ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని వెల్లడైంది. ఈ కేసులో ఖమ్మం రూరల్ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన ఇమామ్‌బీ, అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్‌రావు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తన భర్తను చంపేయమని ఇమామ్‌బీ ప్రియుడు మోహన్‌రావును కోరింది.
పథకం ప్రకారం మోహన్ తన మిత్రుడైన వెంకటేశ్, ఆర్‌ఎంపీ వైద్యుడు బండి వెంకన్నకు మత్తు మందు ఇచ్చి జమాల్‌కు ఇంజక్షన్ వేయాలని సూచించాడు. ఇద్దరూ ముదిగొండ మండలం బాణాపురం వద్ద కాపు కాశారు. బైక్‌లో పెట్రోల్ అయిపోయిందంటూ లిఫ్ట్ అడిగిన ఆర్‌ఎంపీ వెంకన్న జమాల్‌కు మత్తు మందు ఉన్ ఇంజక్షన్ చేశాడు. ఏదో గుచ్చినట్లు అనుమానం వచ్చి జమాల్ బండి ఆపాడు. దీంతో వెంకన్న వేరే బైక్ మీద వచ్చిన వెంకటేశ్‌తో కలిసి పరారయ్యాడు. ఈ కేసులో పోలీసులు నిందితుల నుంచి రెండు బైక్‌లు, ఆరు సెల్‌ఫోన్లు, వినియోగించని మత్తుమందు బాటిల్, ఉపయోగించిన ఇంజక్షన్ బాటిల్‌స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com