అమ్మానాన్న రక్తపు మడుగులో.. బాల్కనీలో ఏడుస్తున్న చిన్నారి

నాలుగేళ్ల చిన్నారి బాల్కనీలో నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇరుగు పొరుగు వారికి ఆ పాప ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి చూసే సరికి చిన్నారి అమ్మానాన్న రక్తపు మడుగులో శవాలై కనిపించారు.
న్యూజెర్సీలోని నార్త్ ఆర్లింగ్టన్ బరోలోని రివర్‌వ్యూ గార్డెన్స్ కాంప్లెక్స్‌లోని వారి 21 గార్డెన్ టెర్రేస్ అపార్ట్‌మెంట్‌లో బాలాజీ రుద్రవర్ (32), అతని భార్య ఆరతి (30) మృతదేహాలు లభ్యమయ్యాయి.
"బాల్కనీలో నా మనవరాలు ఏడుస్తున్నట్లు పొరుగువారు చూసి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొడుకు, కోడలు మరణించిన విషయం తెలిసింది అని బాలాజీ తండ్రి భరత్ రుద్రవర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారని ఎందుకు మరణించారో అర్థం కావట్లేదని వాపోతున్నారు.
"మరణానికి దారి తీసిన పరిస్థితులను నిర్ధారించడానికి పరిశోధకులు మృతదేహాలను పోస్ట్ మార్టంకు పంపించారు. అయితే బాధితులు ఇద్దరూ కత్తిపోటుకు గురైనట్లు ధృవీకరించారు. "అక్కడి స్థానిక పోలీసులు గురువారం ఈ విషాదం గురించి నాకు తెలియజేశారు. మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తరువాత తెలియజేస్తామని యుఎస్ పోలీసులు చెప్పారు"అని భరత్ రుద్రవర్ చెప్పారు.
"నా కోడలు ఏడు నెలల గర్భవతి" అని ఆయన పేర్కొన్నారు. "మేము వాళ్ల ఇంటికి ఒకసారి వెళ్ళాము. మళ్లీ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాము" అని అతను చెప్పాడు. అవసరమైన ఫార్మాలిటీలు పూర్తి చేసిన తరువాత మృతదేహాలు భారతదేశానికి చేరుకోవడానికి కనీసం 8 నుండి 10 రోజులు పడుతుందని యుఎస్ అధికారులు తనకు సమాచారం ఇచ్చారని ఆయన చెప్పారు.
"నా మనవరాలు ఇప్పుడు నా కొడుకు స్నేహితుడితో ఉంది. న్యూజెర్సీలో 60% జనాభా ఉన్న స్థానిక భారతీయ సమాజంలో ఆయనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, "అని ఆయన అన్నారు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని అంబజోగైకి చెందిన ఐటి ప్రొఫెషనల్ బాలాజీ రుద్రవర్, 2014 డిసెంబర్‌లో ఆరతిని వివాహం చేసుకున్నారు. 2015 ఆగస్టులో తన భార్యతో కలిసి యుఎస్‌కు వెళ్లారు. బాలాజీ తండ్రి భరత్ రుద్రవర్ వ్యాపార వేత్త. బాలాజీ ప్రముఖ భారతీయ ఇన్ఫోటెక్ కంపెనీలో పనిచేస్తుండగా, అతని భార్య గృహిణి అని భరత్ రుద్రవర్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com