ఇంటర్ స్టూడెంట్ హత్య కేసు..ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్ధినిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. విశాఖ జిల్లాలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు స్థానికంగా ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ పూర్తిచేసింది. శనివారం రాత్రి శ్రీనగర్ కొండపై సాయిబాబా గుడి వద్ద రామ్ అనే యువకుడితో యువతి మాట్లాడుతుంటే బీఎల్ చివరి సంవత్సరం చదువుతున్న అఖిల్ అనే మరొ యువకుడు అక్కడికి వెళ్లాడు. వీరి ముగ్గురి మధ్య మాటల సందర్భంలో వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. కోపం పట్టలేని అఖిల్ తన వెంట తెచ్చిన కత్తితో ఆమెపై ఒక్కసారిగా దాడి చేసి గొంతు కోసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన యువతి రక్తస్రావంతో ఇంటికి చేరుకుంది. కూతురు పరిస్థితిని గమనించిన ఆమెకుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది.
యువతిపై దాడి ఘటన తెలియగానే వెంటనే అక్కడికిచేరుకున్న పోలీసులు.. నిందితుడు అఖిల్ అదుపులోకితీసుకొన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. అర్థరాత్రి వరకూ పరారీలో ఉన్న రామ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం అఖిల్, రామ్‌ల మధ్య గొడవ జరిగినట్లు.. తనను ఆ యువతి పట్టించుకోవడం లేదన్న అక్కసుతో అఖిల్ ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు. చదువులో ఎప్పుడూ ముందుండే యువతిని పాశవికంగా హత్య చేయడానికి ఇతర కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నడిరోడ్డుపై యువతిపై కత్తితో దాడిచేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com