Jaipur: అమ్మ కష్టంతో పెరిగాడు.. మద్యానికి బానిసై ఆమెనే చంపేశాడు..

జైపూర్‌లో తన సొంత తల్లిని హత్య చేసిన ఆరోపణలపై 31 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ దారుణమైన దాడిని చిత్రీకరించిన భయానక వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఈ సంఘటన సమయంలో మరొక కుటుంబ సభ్యుడు రికార్డ్ చేసినట్లు భావిస్తున్న ఈ ఫుటేజ్‌లో నవీన్ సింగ్ తన 52 ఏళ్ల తల్లి సంతోష్‌ను తీవ్రంగా కొట్టడం కనిపిస్తుంది. ఆమె స్పృహ కోల్పోయి నేలపై కూలిన తర్వాత కూడా దాడి కొనసాగుతోంది.
కర్ధాని అరుణ్ విహార్‌లో నివసిస్తున్న కుటుంబంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సింగ్ తన తల్లిదండ్రులు, ఇద్దరు సోదరీమణులతో అదే ఇంట్లో నివసిస్తున్నాడు.
ఢిల్లీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు నవీన్ సింగ్. అతడి తండ్రి లక్ష్మణ్ సింగ్ ఆర్మీ మాజీ అధికారి. దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. ఆయన, ఆయన కుమార్తెలు నవీన్‌ను అదుపులో ఉంచడానికి ప్రయత్నించారు కానీ వారు అతడిని దాడి చేయకుండా ఆపడంలో విఫలమయ్యారు. ఈ ఘర్షణలో ముగ్గురూ గాయపడ్డారు. మాజీ కాల్ సెంటర్ ఉద్యోగి అయిన నవీన్ సింగ్ చాలా కాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీని కారణంగానే అతని తల్లితో తరచుగా గొడవలు జరిగేవని పోలీసులకు కుటుంబసభ్యులు తెలిపారు.
సంతోష్ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిస్‌కనెక్ట్ చేసి కొడుకును తిట్టడంతో వివాదం మొదలైందని పోలీసులు తెలిపారు. వంటగదిలో గ్యాస్ సిలిండర్ కూడా అయిపోయింది అదే సమయానికి. దాంతో కొడుకు ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నాడని ఆవేశంతో ఆమె అతడిపై ఆగ్రహించింది.
తల్లి అరిచిందన్న కోపంతో నవీన్ సింగ్ ఆమె గొంతు పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె ముఖంపై పదే పదే కొట్టి, తన గది నుండి తెచ్చిన కర్రతో ఆమె తలపై కొట్టాడు. ఈ గొడవ చూసి భయపడిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని నవీన్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సంతోష్ అపస్మారక స్థితిలో పడిఉంది పోలీసులు వచ్చే సమయానికి. చెవి నుండి రక్తం కారుతున్నట్లు గుర్తించి వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, కానీ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. తలకు బలమైన గాయం కావడం వల్లే మరణం సంభవించిందని వైద్యులు తెలిపారు.
నవీన్ సింగ్ 2020లో వివాహం చేసుకున్నాడని, అయితే అతని భార్య కుటుంబ కలహాల కారణంగా అతన్ని విడిచిపెట్టిందని పోలీసులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com