Kamareddy: ఇంకా వీడని మిస్టరీ

కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ముగ్గురి అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. భిక్కనూరు ఎస్సై సాతెల్లి సాయికుమార్ (32), బీబీపేట కానిస్టేబుల్ కమ్మరి శ్రుతి (32), బీబీపేటకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్ తోట నిఖిల్ (28) అదృశ్యం కాగా.. శ్రుతి, నిఖిల్ మృతదేహాలు అర్ధరాత్రి వేళ సదాశివనగర్ మండలం అడ్లూర్‌ఎల్లారెడ్డి పెద్దచెరువులో లభించాయి. సాయికుమార్ మృతదేహాన్ని కూడా అదే చెరువులో కనుగొన్నారు. ఈ చెరువు దగ్గర ముగ్గురి వస్తువులు కనిపించడంతో గాలించగా.. మృతదేహాలు బయటపడ్డాయి.
వీడని మిస్టరీ
కామారెడ్డి మండలం నర్సన్నపల్లి శివారులో ఎస్సై సాయికుమార్... శ్రుతి, నిఖిల్ ను కలిశారు. అక్కడి నుంచి ఒంటి గంట ప్రాంతంలో అడ్లూర్‌ఎల్లారెడ్డి పెద్దచెరువు ప్రాంతానికి చేరుకున్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. అనంతరం ముగ్గురూ అదృశ్యమయ్యారనే సమాచారం అందుకుంది. అక్కడ ఎస్సై కారు, శ్రుతి, నిఖిల్‌ల పాదరక్షలు, సెల్‌ఫోన్లు కనిపించడంతో ఏకబికిన 13 గంటలపాటు గాలించారు. అర్ధరాత్రి దాటాక రెండు మృతదేహాలు, మరో మృతదేహం కనిపించాయి. మెదక్ జిల్లాకు చెందిన ఎస్సై సాయికుమార్‌కు భార్య, మూడేళ్ల కుమారుడు ఉండగా.. భార్య ప్రస్తుతం గర్భిణి. శ్రుతికి వివాహం కాగా.. అయిదేళ్ల కిందట విడాకులు తీసుకున్నారు.
క్షణికావేశంలోనే జరిగిందా..?
సంచలనంగా మారిన ముగ్గురి మృతి వెనకున్న మిస్టరీ తెలియడం లేదు. వీరు ముగ్గురూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారా.. క్షణికావేశంలో జరిగి ఉంటుందా అనేది తేలడం లేదు. బలవన్మరణాలకు పాల్పడేంత సమస్య ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ముగ్గురి మధ్య ఎలాంటి పరిచయాలు కొనసాగాయి? అవి వికటించి, వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ప్రమాదకరంగా పరిణమించాయా.. చర్చించుకుని పరిష్కరించుకునేందుకే వారు చెరువు వద్దకు వెళ్లి ఉంటారా... అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. చర్చలు ఫలించకపోవడంతోనే శ్రుతి చెరువులోకి దూకి ఉంటుందా.. ఆమెను కాపాడే ప్రయత్నంలో నిఖిల్, సాయికుమార్ ప్రాణాలు కోల్పోయి ఉంటారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సమస్య గురించి తెలిసిన ముగ్గురూ చనిపోవడంతో మరణాలకు కారణాలేంటన్నది బహిర్గతం కాలేదని పోలీసులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com