స్త్రీ వేషధారణలో వచ్చి మరీ కిడ్నాప్!

ఆడ వేషంలో వచ్చిన ఓ వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటన మెదక్-అవుసుపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అవుసులపల్లి గ్రామానికి చెందిన గంగ, బాలరాజు ఇంటికి ఓ వ్యక్తి స్త్రీ వేషధారణలో వచ్చి బియ్యం కావాలని యాచించాడు.
యజమాని ఇంట్లోకి వెళ్లింది చూసి.. ఆరుబయట ఆడుకుంటున్న వారి ఎనిమిదేళ్ల కూతురు దివ్య(8)ను అపహరించేందుకు ప్రయత్నించాడు. పాప తల్లి చూసి కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని.. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామానికి చెందిన స్వామిగా గుర్తించారు. కాగా నిందితుడు ఓ ప్రైవేటు స్కూల్లో కరాటే టీచర్‌గా పని చేస్తున్నాడని తేలింది.
అయితే స్వామి.. రెండు రోజుల క్రితం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన తన వదినను చూసేందుకు వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తన దగ్గర డబ్బులు లేకపోవడంతో రెండు రోజులుగా భిక్షాటన చేస్తూ శనివారం ఉదయం అవుసులపల్లి గ్రామానికి మహిళా వేషధారణ దుస్తులు ధరించి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com