మహిళా జర్నలిస్ట్ ఆత్మహత్యా యత్నం.. ఎంబీటీ నేత వేధింపులే కారణం

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. గత 20 రోజులుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. ఆయనను ఎదిరించే శక్తి లేదు. నా మరణానికి అతడే కారణమంటూ ఓ సెల్ఫీ వీడియో తీసి నిద్ర మాత్రలు మింగారు జర్నలిస్ట్ సయ్యదా నాహీదా ఖాద్రీ. చాంద్రయణగుట్ట డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. గుల్షన్-ఎ-ఇక్బాల్ కాలనీకి చెందిన నాహీదా (37) ఓ న్యూస్ ఛానల్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
ఎంబీటీ నేత సలీం కొద్ది రోజులుగా ఆమెపై అసభ్యకర వీడియోలు, చిత్రాలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో మానసిక ఒత్తిడికి గురైన నాహీదా శనివారం రాత్రి ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. విషయాన్ని వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. తన తల్లి పరిస్థితికి సలీం కారణమని నాహీదా కూతురు శనివారం అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సీఐ రుద్రభాస్కర్ ఆదేశాల మేరకు డీఐ కెఎన్ ప్రసాద్ వర్మ కేసు నమోదు చేసి సలీంను అరెస్ట్ చేశారు. సలీం వేధింపుల విషయమై నాహీదా మే 25న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ సలీం ఫేస్‌బుక్ లైవ్‌లో ఆమెను దారుణంగా దూషించారు. దీంతో తీవ్ర వేదనకు గురైన నాహీదా.. సలీం వ్యాఖ్యలతో మానసిక క్షోభకు గురవుతున్నాను. పెళ్లి కావలసిన కూతుళ్లున్నారు. నాకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదు అంటూ సెల్ఫీ వీడియోలో రోదిస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com