జూబ్లీహిల్స్ క్లబ్ లో దొంగలు పడ్డారు... భారీ 'లిక్కర్ స్కాం' బట్టబయలు

జూబ్లీహిల్స్ క్లబ్ లో దొంగలు పడ్డారు... భారీ లిక్కర్ స్కాం బట్టబయలు
బట్టబయలు అయిన భారీ 'లిక్కర్ స్కాం', లిక్కర్ అక్రమ తరలింపు, నల్లబజారులో తక్కువ ధరకే విక్రయం, క్లబ్ సెక్రటరీ నిర్వాకం

Jubliee Hills : జూబ్లీహిల్స్ క్లబ్ లో భారీ లిక్కర్ స్కాం చోటుచేసుకుంది. గత పదేళ్లుగా నడుస్తోన్న మద్యం అక్రమ రవాణాకు టీవీ5 సహకారంతో ఎక్సైజ్ పోలీసులు చాకచక్యంగా చెక్ పెట్టారు. జూబ్లీ హిల్స్ అంతర్జాతీయ క్లబ్ నుంచి ఖరీదైన మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేసి, నల్ల బజారులో సగం ధరకే అమ్ముకుంటోన్న వైనం బట్టబయలు అయింది. క్లబ్ సెక్రటరీ హనుమంతరావు ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా పోలీసుల విచారణలో వెల్లడైంది. పదేళ్లుగా హనుమంతరావు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోందని పోలీసులు నిర్థారించారు.

అసలు ఏం జరిగింది?

గత పేదేళ్లుగా జూబ్లీహిల్స్ క్లబ్ లో ఖరీదైన మద్యం అక్రమ రవాణాకు గురౌతోందని క్లబ్ సభ్యులకు తెలుస్తూనే ఉంది. అయినప్పటికీ వారు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొనడంతో ఇన్నాళ్లూ సైలెంట్ గా ఎవరి పని వారు చేసుకుంటూ పోయారు. హనుమంత రావు కనుసన్నల్లో బార్ సూపర్ వైజర్ మరళ ఖరీదైన లిక్కర్ బాటిళ్లను బయటకు తరలించి నల్లబజారులో సగం ధరకే అమ్మడం పరిపాటిగా మారిపోయింది. ఇక లాక్ డౌన్ అదునుగా రెచ్చిపోయిన క్లబ్ సెక్రటరీ టి.హనుమంతరావు ఆ సమయంలో రూ. కోటిన్నర వరకూ మద్యాన్ని తరలించి సొమ్ము చేసుకున్నాడని స్పష్టమైన ఆధారాలు లభించాయి.

ఇలా చెక్ పెట్టారు...

క్లబ్ నుంచి మద్యం బాటిల్లు అక్రమంగా సరఫరా అవుతున్నాయన్న సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు హనుమంతరావుపై నిఘా పెట్టారు. మురళి, రిషి కుమార్ అనే వ్యక్తులు TS09 EM8518 టూవీలర్ పై మద్యాన్ని తరలిస్తున్నారని తెలుసుకున్నారు. మెట్టుగూడ లో కాపుకాసిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వారిని రెడ్ హ్యాండెండ్ గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని బ్యాచ్ నెంబర్ ల ఆధారంగా చెక్ చేశారు. అవి జూబ్లీహిల్స్ క్లబ్ వేనని తేలిపోయాయి. విచారణలో హనుమంతరావు పాత్ర ఉందని మురళి వాంగ్మూలం ఇచ్చాడు. క్లబ్ లో పార్టీలు జరుగుతున్నప్పుడు ఒక్కో బాటిల్ ను పక్కన పెట్టేవారని నిందితులు ఒప్పుకున్నారు. దీంతో ఈ కేసులో A1 గా చేరుకూరి మురళి నాయుడు, A2గా రిషి కుమార్, A3గా టి. హనుమంతరావు పేర్లను అధికారులు చేర్చారు.

పదేళ్లలో ఎన్ని కోట్ల లిక్కర్ అక్రమ తరలింపుకు గురయ్యాయన్న విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఒకే బ్రాండ్ నుంచి ఒకే బ్యాచ్ నెంబర్ ఉన్న మద్యం బాటిళ్లు మాయం చేస్తే రికార్డులు ఎలా ట్యాలీ అవుతున్నాయని నిందితులను ప్రశ్నిస్తున్నారు. మాయం చేసిన బాటిళ్లను ఏ లెక్కల్లో చూపుతున్నారని ఆరా తీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story