అతడికి 18.. ఆమెకు 22.. పెళ్లేంటని పెద్దలు అనడంతో..

అతడికి 18.. ఆమెకు 22.. పెళ్లేంటని పెద్దలు అనడంతో..
కులగోత్రాలు, వయసు తారతమ్యాలు ఇవేవీ తమ ప్రేమకు అడ్డు గోడలు కాదు అని ఆ ప్రేమికులు చాటి చెప్పాలనుకున్నారు.

కులగోత్రాలు, వయసు తారతమ్యాలు ఇవేవీ ప్రేమకు అడ్డు గోడలు కాదు అని ఆ ప్రేమికులు చాటి చెప్పాలనుకున్నారు. కానీ వారి ప్రేమను పెద్దలు అర్థం చేసుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుని తమ జీవితాలకు ముగింపు పలికారు.

వయసు మధ్య అంతరం ఉందని ఆ ప్రేమికులు పెళ్లి చేసుకుంటామంటే అభ్యంతరం చెప్పారు పెద్దలు. యువతిని తాను ప్రేమించిన యువకుడితో కలవనీయకుండా కట్టడి చేశారు. బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం కూడా జరిపించారు. కానీ మనసు ఒకరిపై మనువు మరొకరితోనా అని ఆ యువతి ఆందోళన చెందింది. ప్రియుడితో కలిసి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన ఏదుల సలేశ్వరంగౌడ్(18) ఇంటర్ చదివి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి అదే గ్రామానికి చెందిన ఉడ్తనూరి రాధ (22) పరిచయమైంది. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన రాధ కరోనా కారణంగా కాలేజీ మూతపడడంతో గ్రామంలోనే ఉంటోంది. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగుతోంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి ప్రేమను నిరాకరించారు. రాధకు మరొక వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిపించారు. విషయం తెలుసుకున్న సలేశ్వరం గ్రామానికి వచ్చి రాధను తీసుకుని వెళ్లిపోయాడు.

ఇద్దరూ అదృశ్యమవడంతో ఇరు కుటుంబాల వారు గాలిస్తున్నారు. ఎంత వెతికినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం సాయింత్రం నల్లమల అటవీ ప్రాంతంలో గొర్రెలు కాస్తున్న కాపరులకు రామచంద్రికుంట సమీపంలో వీరిద్దరూ చెట్టుకు వేలాడుతూ కనిపించారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయగా అక్కడికి వెళ్లి వారిని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story