Uttar Pradesh : యూపీలో ఘోర ప్రమాదం.. 26 మంది మృతి..

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు.. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ట్రాక్టర్-ట్రాలీ దుర్ఘటన తనను ఎంతో బాధించిందని మోదీ ట్వీట్ చేశారు. సన్నిహితులను కోల్పోయిన వారందరు ఈ బాధ నుంచి త్వరగా బయటపడాలని ప్రార్థించారు. యూపీ ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తుందని మోదీ ట్వీట్ చేశారు.
యూపీలోని కాన్పూర్‌లో శనివారంరాత్రి ఈఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 26 మంది మరణించారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 11మంది చిన్నారులే ఉండటం తీవ్రంగా కలచివేసింది. ట్రాక్టర్ ట్రాలీలో చంద్రికాదేవి ఆలయ దర్శనానికి వెళ్లి.. ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి ఘటంపూర్ చెరువులో పడిపోయింది. దీంతో 26మంది చనిపోయారు. చెరువు నుంచి 22 మృతదేహాలను బయటకు తీశారు. నలుగురు చికిత్స పొందుతూ చనిపోయారు. క్షతగాత్రులకు స్థానిక PHCలో చికిత్స అందుతోంది.
ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఘటనా స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ప్రజలు ట్రాక్టర్ ట్రాలీని వ్యవసాయ పనులకు, సరుకు రవాణాకు మాత్రమే ఉపయోగించాలని.. ప్రయాణికుల రవాణాకు వద్దని విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com