ప్రేమించమని వెంటపడ్డాడు.. ప్రేమించలేదని చంపేశాడు..

ప్రేమించమని వెంటపడ్డాడు.. ప్రేమించలేదని చంపేశాడు..
ల్లూరు జిల్లా గూడూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ విద్యార్థిని బలైంది.

ఇద్దరు వ్యక్తుల మధ్య కలిగే ఓ అందమైన అనుబంధం ప్రేమ. తానొక్కడే ప్రేమిస్తే సరిపోతుందా.. అవతలి వ్యక్తికి కూడా తన పట్ల ప్రేమ, ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి. పగ, ద్వేషంతో ప్రేమని ఎలా సంపాదించుకుంటారు. తాను ప్రేమించిన వ్యక్తి తనను ప్రేమించట్లేదని తెలిసి హంతకులుగా మారిపోతున్నారు.. నిండు జీవితాల్ని బలి చేస్తున్నారు ఒన్‌సైడ్ లవర్స్.

తాజాగా నెల్లూరు జిల్లా గూడూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ విద్యార్థిని బలైంది. సుధాకర్, సరిత దంపతులకు అమ్మాయి తేజస్విని, అబ్బాయి కార్తీక్ ఉన్నారు. దంపతులిరువురు ఉపాధ్యాయులు. తేజస్విని ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది.

సుధాకర్ సహచర ఉద్యోగి చెంచు కృష్ణయ్య కుమారుడు వెంకటేష్‌కి, తేజస్వినికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెను ప్రేమించమంటూ వెంటపడేవాడు. ఏడాది కాలంగా అతడి ప్రవర్తనకు విసిగి పోయిన తేజస్విని ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో కొడుకు వెంకటేష్‌ను చెంచుకృష్ణయ్య బెంగళూరు పంపించారు. కానీ కరోనా కారణంగా ఏడాది నుంచి గూడూరులోనే ఉంటున్నాడు వెంకటేష్. మళ్లీ ప్రేమించమంటూ తేజస్విని వెంట పడి వేధించడం మొదలు పెట్టాడు. కానీ ఆమె అంగీకరించకపోవడంతో తెజస్వినిపై పగ పెంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో సుధాకర్, సరిత గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లగా.. ఇంట్లో తేజస్విని, కార్తీక్ ఉన్నారు. 11 గంటల సమయంలో వెంకటేష్, తన స్నేహితుడిని వెంటబెట్టుకుని తేజస్విని ఇంటికి వచ్చాడు. తాను కిందే ఉండి స్నేహితుడిని పైకి పంపించాడు. ఈ విషయం తండ్రికి చెప్పాలని కార్తీక్ ఫోన్ తీసుకుని బయటకు వచ్చాడు. అది గమనించిన వెంకటేష్ వేగంగా పైకి వెళ్లి స్నేహితుడిని అక్కడి నుంచి పంపించేశాడు. తేజస్విని ఉన్న రూమ్‌లోకి వెళ్లి.. పదునైన చాకుతో ఆమె గొంతులో పొడిచాడు వెంకటేష్. తరువాత చున్నీని ఆమె మెడకు బిగించి చంపేశాడు.

కార్తీక్ ద్వారా విషయం తెలుసుకున్న సుధాకర్ హుటా హుటిన ఇంటికి వచ్చి చూశాడు. తలుపులు బిగించి ఉన్నాయి. ఎంత కొట్టినా తెరవట్లేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూశారు. అప్పటికే కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న తేజస్విని.. చీరతో కిటికీకి ఉరేసుకున్న వెంకటేష్ కనిపించారు. పోలీసులు వెంటనే ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అయితే తేజస్విని అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేష్, చెంచుకృష్ణయ్య, వెంకటేష్ స్నేహితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story