చిన్నతప్పుకి మానవత్వం మరిచి చేతులు కట్టేసి.. పేడ తినిపించి..

వాళ్లేదో బంగారం దొంగతనం చేసినట్టు ఆ ఇద్దరు పిల్లలను చితక బాదారు మామిడి తోట కాపలాదారులు. వాళ్లు కూడా చిన్నప్పుడు ఇలాంటి పన్లు చాలానే చేసుంటారు. అయినా అవేం గుర్తుకు రాలేదు వాళ్లకు. గొడ్డును బాదినట్లు బాదారు కట్టేసి కొట్టారు. అంతటితో ఆగక అక్కడే కట్టేసి ఉంచిన బర్రెల పేడ తినిపించారు. పక్కా శాడిస్టుల్లా వ్యవహరించారు.
ఈ దుర్మార్గపు ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో చోటు చేసుకుంది. ఇక్కడి సాయినగర్‌కు చెందిన ఇద్దరు పిల్లలు కంఠాయపాలెం శివారు మామిడితోటలో కాయలు దొంగిలించడానికి వచ్చారంటూ కాపలా దారులు వాళ్లను పట్టుకుని కట్టేశారు. తాము దొంగతనానికి రాలేదని చెప్పినా వినిపించుకోకుండా తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు.
ఈ ఘటన మొత్తాన్ని వారి చేతికి చిక్కని మరో పిల్లవాడు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి లోకల్ వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్ అయింది. విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో పిల్లలను చావబాదిన ఇద్దరు వ్యక్తులు.. బోతల తండాకు చెందిన బానోత్ యాకును, హచ్చు తండాకు చెందిన బోనోత్ రాములుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com