Crime News: ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో.. కక్ష కట్టిన ప్రియుడు నవ వధువును దారుణంగా..

Crime News: అప్పటి వరకు అతడితో తిరిగింది.. అన్నీ పంచుకుంది.. అంతలోనే దూరం పెట్టింది.. వేరొకరి చేత తాళి కట్టించుకుంది.. నాకు దక్కంది మరొకరికి దక్కకూడదన్న కక్షతో ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు ప్రేమించిన ప్రియుడు.. ఈ దుర్ఘటన కర్ణాటక రాష్ట్రం దేవనహళ్లి తాలూకా అవతి గ్రామంలో చోటు చేసుకుంది.
సౌమ్య (23), సుబ్రమణ్య (25) ఇద్దరూ గతంలో బెంగళూరు నాగవారలో ఉన్న కాఫీడేలో పని చేసేవారు.. అక్కడే మొదలైన వారి పరిచయం ప్రేమగా మారింది. ఉన్నట్టుండి ఒక రోజు కాఫీడేలో ఉద్యోగం మానేసింది సౌమ్య. ఏమైందో తెలియదు, ఎందుకు మానేసిందో అర్థం కాలేదు సుబ్రమణ్యంకు.
రెండు వారాల క్రితం వేరే వ్యక్తిని వివాహం చేసుకుందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. దీంతో రగిలిపోయిన సుబ్రమణ్య ఆమెను చంపేయాలని పథకం వేశాడు. సమయం కోసం వేచి చూశాడు.. ఈ క్రమంలో సౌమ్య బుధవారం తన గ్రామం అవతికి వచ్చింది.
ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్నాడు.. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సౌమ్య కేకలు విన్న స్థానికులు పరుగున రావడంతో సుబ్రమణ్య ఇంటి వెనుక నుంచి గోడదూకి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ సౌమ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. విజయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com