ఇద్దరు పిల్లలు పుట్టాక అందంగా లేదని, అదనపు కట్నం కావాలని.. విరక్తి చెందిన భార్య పిల్లలతో సహా..

ఇద్దరు పిల్లలు పుట్టాక అందంగా లేదని, అదనపు కట్నం కావాలని.. విరక్తి చెందిన భార్య పిల్లలతో సహా..
పెళ్లికి ముందు రంభ, ఊర్వశిలా కనిపిస్తుందా.. అప్పుడు లేని మాయ రోగం, పెళ్లయిన తరువాత మొదలవుతుంది.

పెళ్లికి ముందు రంభ, ఊర్వశిలా కనిపిస్తుందా.. అప్పుడే లేని మాయ రోగం, పెళ్లయిన తరువాత మొదలవుతుంది.. అందంగా లేవనో, పొట్టిగా ఉన్నావనో, లేదంటే లావుగా ఉన్నావనో ఏదో ఒక కారణంతో వేధించడానికి రెడీ అవుతుంటారు కొందరు మగ మహానుభావులు.. అయినా ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత అదేం జాడ్యం.. అందంగా లేవనం, తెచ్చిన కట్నం చాల్లేదు ఇంకా తీసుకురా అనడం, దాంతో ఆమెకు బ్రతుకు మీద విరక్తి పుట్టింది. అతడిని భరించడం కష్టమనుకుంది.. అభం శుభం తెలియని ఇద్దరు కవల పిల్లలతో సహా మేడ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషాద సంఘటన హైదరాబాద్ బన్సీలాల్ పేటలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాకు చెందిన రామం 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు.. అతడికి నలుగురు కుమార్తెలు.. మూడేళ్ల క్రితం చిన్న కూతురు సౌందర్యను కొండాపూర్ కు చెందిన గణేష్ కు ఇచ్చి వివాహం చేశాడు. ఉన్నంతలో కూతురు పెళ్లి ఘనంగా చేశాడు. అడిగినంత కట్నం ఇచ్చాడు. గణేష్, సౌందర్య ఉప్పల్ లోని భరత్ నగర్ లో నివసిస్తున్నారు. పద్మారావు నగర్ లోని ఓ సెలూన్ లో పని చేస్తున్న గణేష్ రోజూ ఏదో ఒక కారణంతో భార్యను వేధిస్తుండేవాడు. అందంగా లేవనడం, అదనపు కట్నం కావాలనడం, ఇంట్లో ఎప్పుడో ఏదో ఒక రభస.

ఏడాదిన్నర క్రితం సౌందర్య కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. భర్త వేధింపులు భరించలేక నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది సౌందర్య. సోమవారం ఉదయం 11 గంటలకు భర్త పని చేస్తున్న సెలూన్ కు వెళ్లి తననకు తీసుకువెళ్లాల్సిందిగా కోరింది. కానీ అతడు వినలేదు. దీంతో మనస్థాపం చెందిన సౌందర్య జీవితంపై విరక్తి చెందింది. బన్సీలాల్ పేటకు తిరిగి వచ్చి తల్లి నిద్ర పోతున్న సమయంలో ఇద్దరు చిన్నారులను తీసుకుని వారు ఉంటున్న అపార్ట్ మెంట్ లోని 8వ అంతస్థు పైకి వెళ్లింది. అక్కడి నుంచి పిల్లలను కిందకు విసిరేసి, ఆమె కూడా దూకేసింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story