మేడ్చల్ ఘటనలో నలుగురు అరెస్ట్.. పోలీసుల విచారణలో కీలక విషయాలు

హైదరాబాద్ శివార్లలో విద్యార్థిని కిడ్నాప్, అత్యాచార యత్నం కేసు సంచలనం రేపుతుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వీళ్లంతా కూడా 25 నుంచి 30 ఏళ్ల వయసువాళ్లే. వారం రోజులు రెక్కీ నిర్వహించి మరీ వీళ్లు ఇలాంటి ప్లాన్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. కంప్లైంట్ రాగానే బాధితురాలిని కాపాడడం, ఆ తర్వాత CC ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించడం, సెల్ టవర్ లొకేషన్ వివరాలతో వాళ్లను అరెస్టు చేయడం వేగంగా జరిగింది.
దిశను గుర్తుకు తెచ్చే మేడ్చల్ ఘటనతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. ఓ కళాశాలలో బీ-పార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న బాధితురాలు సాయంత్రం 6.15 గంటలకు రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సు దిగింది. ఆటో ఎక్కిన తర్వాత ఇంటికి వస్తున్నానంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆ ఆటోలో డ్రైవర్‌తో పాటు ఓ మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. కొంతదూరం వెళ్లాక మహిళ దిగిపోయింది. ఆటోలో ఉన్న వ్యక్తి ఫోన్ చేసి మరో ఇద్దరిని పిలిపించుకొని మార్గమధ్యలో ఆటోలో ఎక్కించాడు. ఆ విద్యార్థిని దిగాల్సిన స్టేజి వచ్చింది. ఆటోను ఆపాలని డ్రైవర్‌ను కోరగా ఆపకుండా ఘట్‌కేసర్ వైపునకు వేగంగా వెళ్లాడు.
భయాందోళనకు గురైన ఆ యువతి ఇంటికి ఫోన్ చేసి, తల్లిదండ్రులకు విషయాన్ని వివరించింది. వారు వెంటనే స్థానిక కౌన్సిలర్‌తో పాటు పలువురికి సమాచారాన్ని అందించారు. 100కు డయల్ చేశారు. సాయంత్రం 6.29 గంటలకు పోలీసులకు కాల్ వెళ్లింది. వెంటనే పోలీస్ వ్యవస్థ అప్రమత్తమైంది. భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు విద్యార్థిని ఫోన్ సిగ్నల్స్‌ను వెంబడించాయి. అప్పటికే ఆటోలో యన్నంపేట వరకు వచ్చిన దుండగులు ఆమెను ఓ వ్యాన్‌లోకి మార్చారు. ఈ క్రమంలో దాడి చేసి యువతి దుస్తులు చింపేశారు. విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించింది. పెనుగులాట కొనసాగుతుండగానే వ్యాన్‌లో ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఎటు చూసినా పోలీసు వాహనాలు పెద్ద ఎత్తున సైరన్‌లతో తిరుగుతుండడంతో దుండగులు భయపడ్డారు. దాంతో యువతిని అవుటర్ రింగ్ రోడ్డు అన్నోజిగూడ పాయింట్ దగ్గర సర్వీసు రోడ్డు పొదల్లో విసిరేసి పారిపోయారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి పోలీసు వాహనం వచ్చింది. పొదల్లో స్పృహ తప్పి పడి ఉన్న యువతిని చూసిన ఓ ఎస్సై వెంటనే ఆమెను భుజంపై వేసుకొని వాహనంలోకి చేర్చి, వేగంగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. 7.50 గంటలకు యువతిని పోలీసులు రక్షించారు. అంటే గంటా ఇరవై నిమిషాల్లో గాలింపు ఆపరేషన్ పూర్తిచేసి, ఆమెను రక్షించారు.
ఈ కేసులో నిందితులంతా 25-30 ఏళ్లలోపు వాళ్లే. ఇలాంటి దారుణానికి ఒడిగట్టేందుకు వాళ్లు వారం రోజులుగా రెక్కీ కూడా చేసినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. నిందితులు రాజు, భాస్కర్, నాదం శివ, రమేష్‌లను భువనగిరి SOT పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఫిర్యాదు రాగానే వేగంగా స్పందించిన పోలీసులు.. 24 గంటలు తిరిగేలోపే నిందితుల్ని అరెస్టు చేశారు. నాగారం సర్కిల్‌లో సీసీ ఫుటేజ్ ఆధారంగా ముందు ఆటో గుర్తించారు. తర్వాత సెల్ టవర్ లొకేషన్ ట్రేస్ చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. ఈ అత్యాచారయత్నం ఘటనపై కీసర పీఎస్‌లో కేసు నమోదు చేశారు. నిందితులపై కిడ్నాప్, రేప్ అటెంప్ట్, బెదిరింపులతో పాటు నిర్భయ సెక్షన్ కింద కేసులు పెట్టి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నలుగురి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఇలాంటి దారుణాలకు గతంలోనూ ప్లాన్ చేశారా అనేది కూడా రాబట్టేందుకు పూర్తిస్థాయిలో ఎంక్వైరీ జరుగుతోంది. పోలీసులు సత్వరం స్పందించడంతోనే తమ కుమార్తెకు ముప్పు తప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
బాధితురాలు సృహలోకి రావడంతో పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. ఘటనపై రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com