బంధువులకే సుపారీ ఇచ్చి కొడుకును చంపించిన కన్నతల్లి

కన్నకొడుకును కడతేర్చమని తల్లే హంతకులకు సుపారీ ఇచ్చిన ఘటన వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామంలో జరిగింది. బేగరి రాంచందర్,లక్ష్మమ్మకు మొత్తం నలుగురు కొడుకులు. ఇందులో 17 ఏళ్ల మూడవ కొడుకు శివప్రసాద్ చెడు వ్యసనాలకు బానిసై తరచూ తల్లితో గొడవపడుతుండేవాడు. తనకు పెళ్లి చేయమని లేకుంటే నువ్వే రా అంటూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతే కాదు.. తాగేందుకు డబ్బులివ్వమని రోజూ తల్లితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో.. కొడుకు పెట్టే చిత్రహింసలు భరించలేని ఆ తల్లి.. కొడుకును అంతమొందించేందుకు నిర్ణయించుకుంది.
తన బంధువులైన అనంతరాములు, శ్రీశైలం,బక్కయ్య ,భూపాల్‌తో కలసి కొడుకును అంతమొందించేందుకు తల్లి ప్లాన్ సిద్దం చేసింది. మందు తాగుదామని బంధువులతో శివప్రసాద్‌ను పీదరాగేడి గ్రామ సమీపంలోని పొలాల వద్దకు పిలిపించి మందు తాగాక అతన్ని గొంతు పిసికి చంపేశారు. ఆతర్వాత పొలంలో ఉన్న బావిలో పడేశారు. అయితే.. మృతుడి తండ్రి రాంచందర్ ఈనెల 7 వ తేదీన తన కొడుకు కనిపించడం లేదని వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో తల్లే తన బంధువులకు లక్షరూపాయల సుపారి ఇచ్చి కొడుకు శివప్రసాద్‌ను చంపించిందని విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతుడి తల్లి లక్ష్మమ్మతో పాటు ఆమెకు సహకరించిన నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com