Crime: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి మృతి కేసు.. కొనసాగుతోన్న మిస్టరీ

Crime: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి మృతి కేసు.. కొనసాగుతోన్న మిస్టరీ
X


జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి మృతి కేసు ఇప్పటికీ మిస్టరీ కొనసాగుతోంది. యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. ఆమె చెల్లి అదృశ్యంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీప్తి అంత్యక్రియలు ముగిశాయి. పోస్టు మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. మిస్టరీగా మారిన ఈ కేసులో ప్రస్తుతం పోస్టు మార్టం నివేదిక కీలకంగా మారింది. ఇప్పటికే.. ఆమె చేయి, చాతి, చెంప భాగంలో... గాయాలున్ననట్లు వైద్యులు గుర్తించారు.

మరోవైపు అదృశ్యమైన చెల్లి పేరుతో ఓ ఆడియో సోషల్‌ మీడియాలో కలకలం రేపుతోంది. అక్కచావుకు తాను కారణం కాదంటోంది చెల్లి.. దీంతో కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకోవడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే దీప్తీ చెల్లి ఆడియో విడుదల తర్వాత ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. అక్కాచెల్లెలు ఇద్దరే పార్టీ చేసుకున్నారా? మరో వ్యక్తి ఉన్నారా? దీప్తి చావుకు ఎవరు కారణం? దీప్తిని ఎవరైనా హత్య చేశారా? ఇలా ఎన్నో ప్రశ్నలు పోలీసులను వెంటాడుతున్నాయి.

కోరుట్లకు చెందిన శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె దీప్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌‌‌గా పని చేస్తోంది. దీప్తి ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం విధానంలో ఇంటి నుంచి పని చేస్తోంది. రెండ్రోజుల క్రితం దీప్తి తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో కోరుట్ల నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. ఇంట్లో దీప్తి, ఆమె చెల్లెలు మాత్రమే ఉన్నారు. ఆమె చెల్లెలు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రులు ఫోన్‌ చేస్తేదీప్తి, ఆమె చెల్లెలు స్పందించలేదు. అనుమానం వచ్చి పక్కింటివారికి ఫోన్‌ చేశారు. పక్కింటివారు వెళ్లి చూడగా ఇంట్లో దీప్తి విగతజీవిగా పడి ఉండటం గమనించారు. దీప్తి చెల్లెలు చందన కూడా ఇంట్లో కనిపించడం లేదు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉండగా, వంట గదిలో రెండు మద్యం సీసాలు, కూల్‌డ్రింక్‌ బాటిల్‌, తినుబండారాల ప్యాకెట్లు కనిపించాయి. చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆమె, ఓ యువకుడు కలిసి నిజామాబాద్‌ బస్సు ఎక్కినట్లు రికార్డు అయింది. చందన, ఆమె వెంటున్న యువకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి? ఇంకెవరైనా మద్యం తాగారా? చందన ఎందుకు పారిపోయిందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags

Next Story