Nellore Couple Murder : నెల్లూరు దంపతుల హత్యకు కారణం అదే..

Nellore Couple Murder : నెల్లూరులో మూడు రోజుల క్రితం హత్యకు గురైన దంపతుల కేసును.. పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్‌లో సప్లయర్‌గా పని చేస్తున్న శివ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 28న అశోక్‌నగర్‌లోని వారి నివాసంలోనే.. వాసురెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీత దారుణ హత్యకు గురయ్యారు. క్యాంటీన్‌లో అందరి ముందు మందలించాడనే కోపంతో శివ అనే వ్యక్తి హత్య చేసినట్లు నెల్లూరు ఎస్పీ విజయరావు వెల్లడించారు.
నెల్లూరు అశోక్‌నగర్‌లో నివాసిస్తున్న కృష్ణారావు కరెంట్ ఆఫీస్ సెంటరు వద్ద శ్రీరామ్ పేరుతో క్యాటరింగ్, హోటల్ నడిపిస్తున్నాడు. రోజూ కృష్ణారావు హోటల్ మూసేసి రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తుండేవారు. శనివారం రాత్రి కూడా భర్త వస్తారని సునీత బయట తలుపులకు తాళం వేయకుండా నిద్రపోయింది. అప్పటికే రెక్కీ నిర్వహించిన దుండగులు.. ఇంట్లోకి చొరబడి కృష్ణారావు భార్య సునీత తలపై కర్రతో కొట్టారు. దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. దుండగులు బయటకు వస్తున్న క్రమంలో వరండా దగ్గరే కృష్ణారావు ఎదురయ్యారు. వారిని చూసి దొంగలు అంటూ కేకలు పెట్టేలోపే కత్తితో దారుణంగా ఆయన గొంతు కోశారు. దాంతో కృష్ణారావు అక్కడికక్కడే చనిపోయాడు.
ఇక ఆదివారం తెల్లవారుజామున పనిమనిషి ఇంటికి రాగానే దారుణాన్ని చూసి కృష్ణారావు బంధువులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. మృతురాలు వాసిరెడ్డి సునీత.. టీడీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు రాజకీయ కోణంలోనూ దర్యాప్తు చేయాలని స్థానిక టీడీపీ నేతలు కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com