Chennai Road Accident: పెళ్లై నాలుగు రోజులే అయ్యింది.. అంతలోనే..

Chennai Road Accident: మనిషి జీవితం మరీ అంచనా వేయలేకుండా అయిపోయింది. మామూలుగానే అనుకున్నది జరిగితే జీవితం ఎలా అవుతుంది అంటుంటారు. కానీ ఈ మధ్య చాలామంది జీవితాలు కలలో కూడా అంచనా వేయలేని పరిస్థితికి వచ్చేశాయి. అప్పటివరకు మన మధ్యే సరదాగా ఉన్న మనిషి కాస్త పక్కకు వెళ్లగానే ఏం జరుగుతుందో ఊహించలేని విధంగా సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో అదే జరిగింది.
అరక్కోణానికి చెందిన మనోజ్‌కుమార్ (31), తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన వైద్యురాలు కార్తీక (30)కు అక్టోబర్ 28న వివాహం జరిగింది. పెళ్లైనా నాలుగు రోజులే అయ్యింది. కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఇద్దరు. ఇంకా పెళ్లి హడావిడి కూడా పూర్తి కాలేదు. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. కలిసి జీవితాన్ని మొదలుపెడదామనుకున్నా ఆ ఇద్దరు కలిసి కన్నుమూశారు.
మనోజ్ కుమార్, కార్తీక సోమవారం ఉదయం కారులో పెరుంగళ్తూరు నుంచి అరక్కోణం బయలుదేరారు. మప్పేడు సమీపంలోని అరక్కోణం నుంచి చెన్నై వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ లారీ అదుపు తప్పి ఈ జంట వెళుతున్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఇరుక్కుపోయిన మృతిదేహాలను బయటకు తీయడానికి పోలీసులకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. పెళ్లై నాలుగు రోజులే అయిన ఆ జంట మృతితో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com