Disha Salian: సుశాంత్ మేనేజర్ సూసైడ్ కేసు.. ఎవరు చెప్పేది నిజం..?

Disha Salian: బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఎంత సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ అనూహ్య మరణం ఆత్మహత్యే అంటూ పోలీసులు ఈ కేసును పక్కన పెట్టేశారు. అయినా కూడా సుశాంత్ అభిమానులు మాత్రం ఇది ఆత్మహత్య కాదంటూ ఇప్పటికీ పోరాడుతున్నారు. సుశాంత్ మరణానికి కొన్నిరోజుల ముందే తన మేనేజర్ దిశా శాలియాన్ కూడా కన్నుమూయడం అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. తాజాగా మరోసారి దిశా శాలియాన్ పేరు బాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ్యానేజర్‌గా పనిచేసిన దిశా శాలియన్ 2020 జూన్ 8న బాండ్రాలోని తన ఇంటిపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే దిశా ఆత్మహత్యకు కారణం తనపై ఓ రాజకీయ ప్రముఖుడు అత్యాచారానికి పాల్పడమేనని యూనియన్ మినిస్టర్ నారాయణ్ రాణే, తన కుమారుడు, ఎమ్మెల్యే నితేష్ రాణే అప్పటినుండి ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే దీనిపై శాలియాన్ కుటుంబం స్పందించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓ లేఖ రాశారు.
దిశా శాలియాన్ తల్లిదండ్రులు సతీష్ శాలియాన్, వసంతి శాలియన్.. తమకు న్యాయం జరగకపోతే చావు తప్ప మరో మార్గం లేదని రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే వీరు ఇంతకు ముందే నారాయణ్ రాణేపై, తన కుమారుడిపై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో నారాయణ్ రాణేను పోలీసులు విచారణ కూడా చేశారు.
'మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, తన కుమారుడు ఆదిత్య ఠాక్రే అంటే పడని నారాయణ్ రాణే, నితేష్ రాణేలాంటి కొందరు రాజకీయనాయకులు అనవసరంగా ఈ విషయంలో తలదూర్చారు. అంతే కాకుండా మమ్మల్ని కూడా ఈ రాజకీయాల్లోకి లాగి మా జీవితాలను అంధకారంగా మర్చేశారు' అని లేఖలో పేర్కొన్నారు దిశా శాలియాన్ తల్లిదండ్రులు.
'రాణేలు చెప్తున్న అబద్ధాలకు వారి దగ్గర ఏ ప్రూవ్ లేదు. అందుకే ప్రూవ్‌లను కేవలం సీబీఐకు ఇస్తాం, పోలీసులకు ఇవ్వము అని అంటున్నారు. మాకు కొత్త మనుషులను కలవాలంటే భయంగా ఉంది. మాకు తెలిసిన వారిని కూడా ఉన్నట్టుండి కలవానుకున్నా.. వారు మమ్మల్ని కొత్తగా, అనుమానంగా చూస్తున్నారు. మా కూతురుని కోల్పోయిన బాధ ఇప్పటికీ మమ్మల్ని వెంటాడుతున్నా.. ఇలాంటి మనుషులు మమ్మల్ని బాధపడనివ్వకుండా చేస్తున్నారు.' అంటూ లేఖలో తెలిపారు.
ఇంత జరిగినా కూడా నితేష్ రాణే ఇంకా దిశా శాలియాన్ ఆత్మహత్య విషయంలో తాను చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో నితేష్ రాణే మరోసారి దిశా శాలియాన్ ఆత్మహత్య గురించి తెరపైకి తీసుకొచ్చారు. తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్‌లో దిశా గ్యాంగ్ రేప్ గురించి, హత్య గురించి ప్రూవ్‌లు ఉన్నాయి అన్నారు.
ఒకవేళ దిశా శాలియాన్‌ది ఆత్మహత్యే అయితే.. అదే సమయంలో తన అపార్ట్‌మెంట్‌లో సీసీటీవీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు అని ప్రశ్నించారు నితేష్ రాణే. అంతే కాకుండా గెస్ట్ రిజిస్టర్ నుండి రెండు పేజీలు ఎందుకు మిస్ అయ్యాయి అని అడిగారు. అంతే కాకుండా దిశాతో ఉంటున్న తన కాబోయే భర్త రోహన్ రాయ్ ఈ కేసులో కీలక సాక్షి అని, అతడు ఎక్కడికి పారిపోయాడని అన్నారు నితేష్.
తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్‌లను పోలీసులకు ఇస్తే.. వారు ఆధారాలను మార్చేస్తారన్నారు నితేష్ రాణే. పోలీసులు ఈ కేసులో ఎవరినో కాపాడే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం చేశారు. తాను ఆ పెన్ డ్రైవ్‌ను సీబీఐకు తప్ప మరెవరికీ ఇవ్వనని కచ్చితంగా తేల్చి చెప్పారు నితేష్. అయితే ఈ విషయంలో దిశా శాలియాన్ తల్లిదండ్రుల మాటలు నమ్మాలో.. లేదా నితేష్ రాణే మాటలు నమ్మాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com