వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. నిన్‌హైడ్రిన్ పరీక్షకు అనుమతి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తులో కీలకంగా భావించే వివేకా రాసిన లేఖపై సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్షకు అనుమతిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హత్యాస్థలిలో లభించిన లేఖను సీబీఐ అధికారులు 2021 ఫిబ్రవరి 11న సీఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. దీన్ని పరిశీలించిన ఢిల్లీలోని సీఎఫ్ఎస్ఎల్.. ఒత్తిడిలోనే వివేకా రాసిన లేఖగా తేల్చింది. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్‌ను సీబీఐ కోరింది. అయితే.. లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు నిన్‌హైడ్రిన్ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్ఎస్ఎల్ సూచించింది. నిన్‌హైడ్రిన్ పరీక్ష వల్ల లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని స్పష్టంచేసింది.
ఒరిజినల్ లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉండటంతో నిన్‌హైడ్రిన్ పరీక్షకు సీబీఐ అధికారులు కోర్టు అనుమతి కోరారు. రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులు కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని కోర్టును కోరారు. సీబీఐ పిటిషన్‌పై నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు.. నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతి ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com