ఆ అప్పు తీర్చడానికి తల్లి, చెల్లిని హత్యచేసిన కిరాతకుడు

ఆ అప్పు తీర్చడానికి తల్లి, చెల్లిని హత్యచేసిన కిరాతకుడు

క్రికెట్‌ బెట్టింగ్‌ల అప్పులు తీర్చేందుకు తల్లి, చెల్లిని పొట్టనపెట్టుకున్నాడో కిరాతకుడు. భోజనంలో విష గుళికలు కలిపి ఇద్దరినీ కడతేర్చాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి, చెల్లి ఇద్దరూ మృతి చెందారు. మేడ్చల్‌ జిల్లా రావలకోల్‌ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన ప్రభాకరరెడ్డి మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య సునీత.. కూతురు, కొడుకుని చూసుకుంటోంది. తల్లి సునీత ఓ ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేస్తోంది. ఎంటెక్‌ చదివిన సాయినాథరెడ్డి కూడా ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు అనూష బీ ఫార్మసీ చేస్తోంది. తండ్రి ప్రభాకరరెడ్డి మృతి తర్వాత వచ్చిన ఇన్సూరెన్సు డబ్బు, భూమి అమ్మగా మొత్తం కలిపి సుమారు 20 లక్షల వరకు వచ్చింది. ఈ సొమ్మును బ్యాంక్‌లో దాచారు.

అయితే.. ఇటీవల సాయినాథరెడ్డి ఐపిఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ తీవ్రంగా నష్టపోయాడు. ఈనేపథ్యంలో.. సాయినాథ్‌ తల్లికి తెలియకుండా బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేశాడు. ఇది చాలదన్నట్టు ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలను సైతం తీసుకెళ్లి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో బెట్టింగ్‌లు చేయసాగాడు. విషయం తెలుసుకున్న తల్లి.. కొడుకును నిలదీసింది. ఈనేపథ్యంలో.. తల్లి, చెల్లిపై పగ పెంచుకున్న సాయినాథ్‌ వారిని హత మార్చేందుకు పథకం వేశాడు,

ఈ నెల 23న ఇంట్లో వండిన భోజనంలో రాత్రి రసాయన గుళికలు కలిపి ఏమీ ఎరగనట్టు విధులకు వెళ్లాడు. విషయం తెలియని సాయినాథ్‌ తల్లి,చెల్లి విషం కలిసిన భోజనం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయాన్ని సాయినాథ్‌కు చెప్పిన తల్లి సునీత.. ఆఫీసుకు తీసుకెళ్లిన అన్నం తిన వద్దని కొడుకును కోరింది. ఆ వెంటనే ఇంటికి చేరుకున్న సాయినాథ్‌ రెడ్డి ..తల్లి,చెల్లి అపస్మారక స్థితికి చేరుకునే వరకు ఆసుపత్రికి తీసుకెళ్ల లేదు. ఆ తర్వాత తల్లి,చెల్లిని ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే.. చికిత్స పొందుతూ ఒక రోజు తేడాతో సునీత, అనూష ఇద్దరూ మరణించారు. అంత్యక్రియల అనంతరం.. బంధువులు సాయినాథ్‌రెడ్డిని నిలదీయడంతో నిజం ఒప్పుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story