Crime News: కొడుకు దుర్మార్గాలు భరించలేని తల్లిదండ్రులు.. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి..

Crime News: కొడుకు దుర్మార్గాలు భరించలేని తల్లిదండ్రులు.. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి..
Crime News: తండ్రి ఓ రెసిడెన్షియల్ కళాశాలకు ప్రిన్సిపల్.. ఎందరో విద్యార్ధులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అయినా కొడుకుని కంట్రోల్ చేయలేకపోయారు.

Crime News: తండ్రి ఓ రెసిడెన్షియల్ కళాశాలకు ప్రిన్సిపల్.. ఎందరో విద్యార్ధులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అయినా కొడుకుని కంట్రోల్ చేయలేకపోయారు. చిన్నప్పుడు అయితే కొట్టో తిట్టో దారిలోకి తీసుకొచ్చేవారు. కానీ 26 ఏళ్ల కొడుక్కి ఏం చెప్తారు. ఎందుకు అలా చేస్తున్నావంటే ఎదురు తిరుగుతున్నాడు.


కనిపెంచిన తల్లిదండ్రుల మీద కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నాడు. కొడుకు దుర్మార్గాలను సహించలేక కన్నపేగు మీద మమకారం చంపుకుని అతడిని మట్టుపెట్టాలనుకున్నారు. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి మరీ చంపించేశారు.


ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. ఖమ్మానికి చెందిన క్షత్రియ రాంసింగ్, రాణిబాయి దంపతులకు కుమారుడు సాయినాథ్ (26), కుమార్తె ఉన్నారు. రామ్ సింగ్ సత్తుపల్లిలోని ఓ రెసిడెన్షియల్ కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.


కొడుకు సాయినాథ్ డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసి చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు. వ్యసనాలకు బానిస అయ్యాడు. ప్రతి రోజు డబ్బులు కావాలంటూ తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవాడు. తల్లి అని కూడా చూడ కుండా ఆమెపట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు.


దీంతో తల్లిదండ్రులకు కుమారుడి మీద విరక్తి కలిగింది. అతడి చర్యలను కట్టుదిట్టం చేయలేక మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సాయినాథ్ మేనమామ సత్యన్నారాయణ సింగ్‌ను సంప్రదించారు.


దీంతో అతడు సాయినాథ్‌ను చంపించేందుకు కిరాయి హంతకులను మాట్లాడాడు.. రూ.8లక్షలకు బేరం కుదిర్చాడు. అక్టోబర్ 18న సత్యన్నారాయణ సింగ్, కిరాయి హంతకులతో కలిసి నల్గొండ జిల్లా కల్లేపల్లిలోని మైసమ్మ దేవాలయం వద్ద దావత్ చేసుకుందామని సాయినాథ్‌ను తీసుకెళ్లారు. అక్కడ అందరూ మద్యం తాగి.. సాయినాథ్ మెడకు ఉరి బిగించి చంపేశారు.

సాయినాథ్ కారులోనే శవాన్ని తీసుకెళ్లి మూసీ నదిలో పడేశారు. మరుసటి రోజు శవం నదిలో తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మీడియా ద్వారా విషయం తెలిసిందంటూ మూడు రోజులకు తల్లిదండ్రులు వచ్చి కొడుకు శవాన్ని తీసుకెళ్లారు.


సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించిన పోలీసులకు ఘటనా స్థలంలో కనిపించిన కారు, మృతుడి తల్లిదండ్రులు తీసుకువచ్చిన కారు ఒకటేనని గుర్తించారు. దీంతో తల్లిదండ్రులే హంతకులని నిర్ధారించుకుని ఆ దిశలో దర్యాప్తు జరిపారు. చివరకు కొడుకుని తామే చంపించినట్లు ఒప్పుకున్నారు. ఇందుకు సహకరించిన మేనమామను, మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story